TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరపైకి కొత్త వివాదం..యుపీఏకు‘కౌంటర్’షాక్

Published on: Sat Feb 18, 2012 8:44AM

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు జాతీయ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ (ఎన్‌సిటిసి) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయటాన్ని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగా వ్యతిరేకించటంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోంమంత్రి పి చిదంబరం మానస పుత్రికైన ఎన్‌సిటిసి మార్చి 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇస్లామిక్ తీవ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి ముంబయిపై దాడి చేసిన నేపథ్యంలో, ఇలాంటి సంఘటనలకు సంబంధించిన దర్యాప్తు సమర్థంగా కొనసాగేందుకు ఎన్‌సిటిసిని చిదంబరం రూపొందించారు. అయితే ఎనిమిది రాష్ట్రాల సిఎంలు మాత్రం ఎన్‌సిటిసి బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాష్ట్రాల హక్కులు హరించటంతోపాటు ఫెడరలిజానికి చావుదెబ్బగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ఎన్‌సిటిసిని అమలు చేసేందుకు అంగీకరించే ప్రసక్తేలేదంటూ తెగేసి చెప్పారు. యుపిఏ భాగస్వామ్య పార్టీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్‌సిటిసిని గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రధాని మన్మోహన్‌కు ఘాటైన లేఖ రాశారు. దీంతో జాతీయస్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందనే రాజకీయ ప్రచారం ప్రారంభమైంది. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ సహా తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తదితరులు ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తున్నారు.

ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ ప్రధానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాసిన లేఖను నవీన్ పట్నాయక్ పత్రికలకు విడుదల చేయటం గమనార్హం. ఎన్‌సిటిసిని అత్యంత భయంకరమైన చట్టంగా ముద్ర వేసిన మమతా బెనర్జీని సముదాయించేందుకు లోక్‌సభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా ఏర్పాటు చేస్తున్న ఎన్‌సిటిసి చట్టాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ ప్రకటించటంతో యుపిఏ సంకీర్ణ సర్కారు ఇరకాటంలో పడింది. ‘శాంతి భద్రతల అమలు రాష్ట్రాల బాధ్యత. ఈ పరిస్థితుల్లో ఎన్‌సిటిసిని ఎలా అమలు చేస్తారు?’ అంటూ మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం గమనార్హం. కేంద్రం రూపొందించిన ఎన్‌సిటిసి ఫెడరలిజానికి పూర్తిగా వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. ఎన్‌సిటిసిని సవరించాల్సిందేనని ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం తీవ్రవాద సంఘటనలకు సంబంధించిన దర్యాప్తులో ఈ సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండానే అక్కడ ఎవరినైనా అరెస్టు చేసి తమతో తీసుకుపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సిటిసిని తమ రాజకీయ ప్రయోజనాలు కోసం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కాంగ్రేసేతర సిఎంలు ఆందోళను వ్యక్తం చేస్తున్నారు.