ఆడుకునే బొమ్మలు కూడా మెదడుని మార్చేస్తాయి

 

అలా సూపర్‌మార్కెట్టులో సరుకులు కొనుక్కుంటూ తిరిగే సమయంలో మనకి అకస్మాత్తుగా ఎవరో తారసపడతారు. అతని మొహం ఎక్కడో చూసినట్లుందే అని అనిపిస్తుంది. అనిపిస్తుందే కానీ సదరు మొహం ఎవరిదో, దానిని ఇంతకుముందు ఎప్పుడు చూశామో గుర్తుకురాదు. ఈ సమస్య అందరిదీనూ! కానీ మొహాలను గుర్తుంచుకోవడం అనే కళలో ఆడవారికీ మగవారికీ మధ్య తేడాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు.

 

ఇప్పటివరకూ మగవారు ఆడవారికంటే ఎక్కువకాలం పరిచయస్థుల మొహాలను గుర్తుంచుకుంటారు అని నమ్మేవారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తేల్చుకోవాలనుకున్నారు. అందుకోసం ఓ 295 మంది అభ్యర్థుల మీద ఓ పరీక్షని నిర్వహించారు. వీరిలో 161 మంది మగవారు కాగా 134 మంది స్త్రీలు. వీరందరికీ ఆరు చిత్రాలని చూపించారు. ఈ చిత్రాలలో మగవారి మొహాలు, ఆడవారి మొహాలే కాదు... బార్బీ డాల్‌ మొహాలు, ట్రాన్స్‌పార్మర్ బొమ్మల మొహాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు రకరకాల కార్ల బొమ్మలని కూడా చూపించారు.

 

ఇలా ఆరు చిత్రాలను చూపించిన తరువాత, వారికి ఓ మూడు చిత్రాలు చూపించారు. ఈ మూడింటిలో రెండు కొత్తవి, ఒకటి మాత్రం ఇంతకుముందు చూసిన ఆరు చిత్రాలలో ఒకటి ఉండేట్లుగా అమర్చారు. ఈ ప్రయోగంలో తేలిందేమిటంటే... కార్లని గుర్తుపట్టడంలో మగవారు ఆడవారికంటే ఎక్కువ చురుగ్గా కనిపించారు. కానీ వ్యక్తుల మొహాలని గుర్తుపట్టడంలో మాత్రం ఇద్దరికీ సరిసమానంగా మార్కులు పడ్డాయి. కాకపోతే ఇందులో ఒక తిరకాసు ఉంది. బార్బీ బొమ్మలనీ, వాటిని పోలిన మొహాలనీ గుర్తుపట్టడంలో ఆడవారిది పైచేయిగా ఉంటే... ట్రాన్స్‌ఫార్మర్‌ బొమ్మలనీ, వాటిని పోలిన ముఖాలను గుర్తుపట్టడంలో మగవారిది పైచేయి అయ్యింది.

 

మొహాలను గుర్తుపట్టడంలో ఆడవారికీ, మగవారికీ మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణం ఏమిటా అని పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఊహించని జవాబు దొరికింది. చిన్నప్పుడు ఆడపిల్లలు బార్బీ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి మెదడులో అలాంటి రూపాలని త్వరగా నిక్షిప్తం చేసుకునే వ్యవస్థ ఏర్పడుతుందనీ... మగపిల్లలు కార్లు, ట్రాన్సఫార్మర్ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి జ్ఞాపకాలు అలాంటి మొహాల చుట్టూ పెనవేసుకుని ఉంటాయనీ తేలింది.

 

మన దేశంలోని పిల్లలు బార్బీ డాల్స్‌తోనూ, ట్రాన్సఫార్మర్‌ బొమ్మలతోనూ ఆడుకోకపోవచ్చు. కానీ ఏవో ఒక బొమ్మలతో ఆడుకోవడం అయితే ఉంటుంది కదా! అవి ఎలాంటివైనా కూడా వారి మనస్తత్వం మీదా మానసిక ఎదుగుదల మీదా ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనతో తేలిపోయింది. ‘పిల్లవాడు గ్రహాంతరవాసుల గురించి తీసిన ఒక సైన్స్‌ ఫిక్షన్‌ ధారావాహికను చూసినా కూడా, అది ‘మొహాలని గుర్తుపెట్టుకోవడం’ అనే అతని నైపుణ్యం మీద ప్రభావం చూపుతుంది,’ అంటున్నారు ఈ పరిశోధనను నిర్వహించిన శాస్త్రవేత్తలు. కాబట్టి పిల్లలు వేటితో ఆడుతున్నారో, ఏమేం చూస్తున్నారో కూడా మనం గమనించుకోవాలన్నమాట!

 

- నిర్జర.