ప్రెసిడెంట్ రేసులో పవార్? పీకే ఆపరేషన్ ఫలించేనా..

ఎన్సీపీ అధినేత, శరద్ పవార్ పేరు మళ్ళీ మరో మారు,రాష్ట్రాపతి రేసులలో ప్రముఖంగా వినవస్తోంది. పవార్, ప్రస్తుత తరం జాతీయ నేతలలో సీనియర్ అయినా కాక పోయినా, పెద్దరికం పుణికి పుచ్చుకున్న నాయకుడు. ఆయన అధికార కూటమిలో ఉన్నా ప్రతిపక్ష ఫ్రంట్’లో ఉన్నా, రాజకీయాలతో సంబంధం లేకుండా, అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటారు. అందుకే అన్ని పార్టీలలోనూ ఆయనకు మంచి మిత్రులున్నారని, ఆయన్ని గౌరవించే వాళ్ళు, ఆయన గౌరవించే వాళ్ళు అన్నిపార్టీలలో ఉన్నారని,రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతిపక్ష  నాయకుల్లో పవార్ ‘ కు ప్రత్యేక ప్రధాన్యత, గౌరవం ఇస్తారని కూడా పవర్ కారిడార్స్’లో ప్రముఖంగా వినిపిస్తుంది. 

 రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయన్ని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్, ముంబైలో పవార్’ తో భేటి అయ్యారు. ఈ భేటీలో ఆ ఇద్దరు  ఏమి చర్చించారో, ఏమో గానీ, ఈ భేటీ అనతరం శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు ఒక్కసారిగా మీడియాలో వినిపించాయి. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.
నిజానికి, రాష్ట్రపతి రేసులో పవార్’ చాలా పాత హెడ్లైన్. 2017 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా పవార్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపించింది. కాంగ్రెస్ సారధ్యంలోని, యూపీఏ కూటమి సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పవార్ పేరును ప్రతిపాదించారు. అయితే అప్పట్లో పవార్, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.అప్పట్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూడా పవార్ పేరును పరిశీలనకు తెసుకుందని వార్తలొచ్చాయి. నిజానికి, ప్రధాని మోడీ శరద్ పవర్ మధ్య మంచి సంబదాలే ఉన్నాయని, మోడీ ప్రతిపక్ష నేతలు అందరిలో పవార్’కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని అంటారు. 

కొంత కాలం క్రితం శివసేన నేత, సంజయ్ రౌత్, కూడా, రాష్ట్రపతి ఎన్నికల్లో  పవార్  విపక్షాల అభ్యర్ధిగా బరిలో నిలవాలని సూచించారు. పార్టీ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా రౌత్, 2022 లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయాలని సూచించారు. అప్పటికి, విపక్షాల సంఖ్యా బలం పెరిగి, పవార్ గెలుపు సులువుతుందని రౌత్, జోస్యం కూడా చెప్పారు. అయితే, శరద్ పవార్ కానీ, ఎన్సీపీ కానీ, రౌత్ సూచనను పట్టించుకోలేదు. 
అదలా ఉంటే, ఇప్పుడు ఇటీవల పవార్’తో సుదీర్ఘంగా దేశ రాజకీయాలు, 2024 ఎన్నికల వ్యూహం గురించి చర్చించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు పవార్‌ ఒక్కరే కనిపిస్తుండటం, అదే విధంగా ఆయనకు అన్ని పార్టీల  నాయకులతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఈ వ్యూహగానాలకు ఇంకొంత  బలం చేకూరింది. అయితే, పవార్ కానీ, ఎన్‌సీపీ వర్గాలు కానీ, ఈ వ్యూహాగానలపై  ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అవుననీ అనలేదు కాదనీ కొట్టేయలేదు. 

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారతీయ జనతా పార్టీ బలమే అధికంగా ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో అసలు.. పవార్‌ ఈ పదవికి పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా, సుమారు ఆరు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పవార్, రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తారా అనేది కూడా ప్రశ్న గానే ఉంది. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ, అలాగే, ప్రస్తుత ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యాంగ పదవిని స్వీకరించినా, అనేక సందర్భాలలో  తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. సో..ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిజంగానే పవార్’తో అదే విషయం చర్చించారా, లేక 2024 పీఎం అభ్యర్ధి విషయమే  చర్చించారా, అనేది పక్కన పెడితే, పవార్ రాష్ట్రపతి రేసులో నిలిచేందుకు అంగీకరిస్తారా ? అనేది వెయ్యి కాదు వేల లక్షల డాలర్ల ప్రశ్న.