TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

100 స్థానాల్లో వైసీపీకి ఎదురుగాలి!.. పీకే టీమ్ స‌ర్వేతో జ‌గ‌న్‌లో క‌ల‌వ‌రం!

Published on: Mon Jan 31, 2022 12:45PM

మొన్న‌టి వ‌ర‌కూ బిందాస్‌గా ఉన్నారు. మాకు ఎదురే లేద‌ని అనుకున్నారు. స్థానిక ఫ‌లితాలు చూసి విర్ర‌వీగారు. అదంతా వాపు కాదు బ‌లుపు అని ఇప్పుడిప్పుడే తెలుసొస్తోంది వైసీపీకి. ఒక్క ఛాన్స్‌.. మ‌రొక్క ఛాన్స్‌గా మారడం క‌ష్ట‌మ‌ని పీకే టీమ్ చెబుతోంది. ఊరికే గాలి మాట‌లు కాదు.. ప‌క్కాగా స‌ర్వేలు చేసి.. జ‌నం నాడి ప‌ట్టి మ‌రీ.. లెక్క‌లేసి జ‌గ‌న్‌రెడ్డి టేబుల్ మీద ఆ స‌ర్వే రిపోర్టు పెట్టింది. పీకే టీం స‌ర్వేల‌పై జ‌గ‌న్‌కు బాగా గురి. అందుకే, ఆయ‌న‌లో క‌ల‌వ‌రింత మొద‌లైపోయింది. కాస్తో కూస్తో ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంటుంద‌ని భావించారు కానీ.. మ‌రీ ఇంత‌నా? ఏకంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ్యాన్‌కు ఎదురుగాలి వీస్తోందా? అనే ఆందోళ‌న జ‌గ‌న్‌కు నిద్ర లేకుండా చేస్తోంద‌ని చెబుతున్నారు. 

ఒక‌టా.. రెండా.. శిశుపాలుడి త‌ప్పుల్లా.. జ‌గ‌న్ ఖాతాలో ప్ర‌జావ్య‌తిరేక‌త పోగుప‌డుతోంది. ప్ర‌స్తుతం.. ప్ర‌భుత్వ ఉద్యోగుల పీఆర్సీ ర‌గ‌డ‌.. ర‌చ్చ రంబోలా అవుతోంది. ఉద్యోగుల‌తో పెట్టుకొని బాగుప‌డిన ప్ర‌భుత్వాలు చ‌రిత్ర‌లోనే లేవు. అందుకే, సీఎం జ‌గ‌న్‌రెడ్డి పీఆర్సీతో చారిత్ర‌క తప్పిదం చేశారంటున్నారు. త‌న ఓట‌మికి తానే కార‌ణంగా మార‌బోతున్నార‌ని విశ్లేషిస్తున్నారు. ఉన్న‌ది 18 ల‌క్ష‌ల మంది ఉద్యోగులే అయినా.. ఒక్కో ఉద్యోగి మ‌రో 10 మందినైనా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌డు. ఆ లెక్క‌న జ‌గ‌న్ ఓటు బ్యాంక్ మొత్తం ప్ర‌భావితం కావ‌డం ఖాయం. 

ఉద్యోగుల చిచ్చు ర‌గులుతుండ‌గానే.. ఆ టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకే అన్న‌ట్టు ఆ అగ్నిపై నీళ్లు చ‌ల్లే బ‌దులు ఆజ్యం పోసార‌ని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తేనెతెట్టును క‌దిపి మ‌రింత పొర‌బాటు చేశారు. ఆ జిల్లా మాకొద్దు.. మా జిల్లానే మాకు ముద్దు.. అంటూ వివిధ ప్రాంతాల కేంద్రంగా కొత్త జిల్లాల ర‌చ్చ రాజుకుంది. అది ఇప్ప‌ట్లో ఆరే అవ‌కాశ‌మే లేదంటున్నారు. 

ఇక‌, అమ్మ ఒడి ఆల‌స్యం.. ఓటీఎస్ పేరుతో పేద‌ల‌ను వేధించ‌డం.. సంక్షేమ ప‌థ‌కాల‌ అర్హుల సంఖ్య‌ను భారీగా త‌గ్గించ‌డం.. ఇలా ఒక్కో ర‌త్నం రాలిపోతూ.. జ‌గ‌న‌న్న రిక్త‌హ‌స్తం బ‌య‌టికొస్తోంద‌ని అంటున్నారు. 

ఏపీలో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ప్ర‌శాంత్ కిశోర్ టీమ్‌.. త‌మ‌దైన స్టైల్‌లో చేస్తున్న స‌ర్వేల్లో ఈ విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కొస్తున్నాయని తెలుస్తోంది. మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో గెలిచామ‌ని విర్ర‌వీగొద్ద‌ని పీకే టీమ్ జ‌గ‌న్‌రెడ్డికి ఇప్ప‌టికే సూచించింద‌ని స‌మాచారం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. స్థానిక సంగ్రామంలో ఆ సైడే జనాలు మొగ్గు చూపడం ఖాయం. ఉప ఎన్నిక‌ల్లోనూ అదే జరుగుతుంది. అంతేకానీ, ఆ ఫలితాలేవీ ప్ర‌భుత్వ పాల‌న‌కు రెఫ‌రెండం కాబోయ‌ని తేల్చి చెబుతున్నారు. గ‌తంలో 2017లో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ.. 2019లో నంద్యాల‌తో పాటు ఏపీ వ్యాప్తంగా ప‌రాజ‌యం పాల‌వ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. ప్ర‌స్తుత ప్ర‌జావ్య‌తిరేక‌త చూస్తుంటే.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి దారుణ ప‌రాభ‌వ‌మే త‌ప్ప‌ద‌ని పీకే టీమ్ స‌ర్వే ఫ‌లితాలు హెచ్చ‌రిస్తున్నాయి. 

ఇక వైసీపీ నేత‌ల యాక్ష‌న్‌, ఓవ‌రాక్ష‌న్ సైతం పార్టీ ప‌రాజ‌యానికి కార‌ణం కాబోతోంద‌ని పీకే టీమ్ అంచ‌నా. మంత్రుల బూతు పురాణం.. భువ‌నేశ్వ‌రి ఎపిసోడ్‌.. టీడీపీ నేత‌లు, ఆఫీసుల‌పై దాడులు.. క్యాసినోలు.. లాంటివి పార్టీ ఇమేజ్‌ను, జ‌గ‌న్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయ‌నేది పీకే టీమ్ గుర్తించిన మ‌రో కీల‌కాంశ‌మ‌ని తెలుస్తోంది. 

మూడేళ్ల‌ పాలనలో జగన్ పూర్తిగా ప్రభుత్వం మీదనే ఫోకస్ పెట్టారు. పార్టీని పెద్ద‌గా పట్టించుకోలేదు. ఇక‌, వైసీపీ ప్లీనరీ జరిగి ఐదేళ్లు అవుతోంది. పార్టీ కమిటీల ఊసే లేదు. ప‌ద‌వులు రాక పార్టీ నేత‌లు అస‌హ‌నంతో ఉన్నారు. కాంట్రాక్టు ప‌నులు, ఇసుక మైనింగ్‌, లిక్క‌ర్ షాపులు, రియ‌ల్ ఎస్టేట్‌.. త‌దిత‌ర త‌మ నోటికాడి ఆదాయ వ‌న‌రుల‌న్నిటినీ జ‌గ‌న‌న్న మాత్ర‌మే దోచేస్తున్నారు. త‌మ‌కు ఎంగిలి మెతుకులు కూడా మిగ‌ల్చ‌డం లేదంటూ సొంత‌పార్టీ వ్యాపార‌, రాజ‌కీయ నేత‌లే త‌మ బాస్‌పై ర‌గిలిపోతున్నార‌ని పీకే టీమ్ స‌భ్యులు గుర్తించిన స‌రికొత్త అంశం...అంటున్నారు.

ఇక‌, జిల్లాల్లో పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య కోల్డ్‌వార్ మామూలుగా లేదు. అనేక చోట్ల‌ ఎంపీలూ వర్సెస్ ఎమ్మెల్యేలు. సుబ్బారావు గుప్తా లాంటి ఘ‌ట‌న‌లు. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి లాంటి ఆధిప‌త్య పోరు. ఇలా అనేకం.

దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగా లేద‌ని పీకే టీమ్ త‌మ స‌ర్వేల్లో గుర్తించింద‌ని.. ఆ స‌ర్వేల సారాంశాన్ని విశ్లేషించి.. స‌మ‌గ్రంగా నివేదిక రెడీ చేసి.. జ‌గ‌న్‌రెడ్డికి అందించింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం.