TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి పితాని

Published on: Sat May 5, 2012 12:44PM

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యన్నారాయణకు ఓ ప్రత్యేకత వుంది. రాష్ట్రంలో ఏ మంత్రి విమర్శించనంతగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మంత్రి పితాని విమర్శిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన జగన్మోహనరెడ్డిని గజదొంగాగా అభివర్ణించారు. అటువంటి వ్యక్తికీ అధికారం కట్టబెడితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుందని విమర్శించారు. నిజానికి జగన్ ను విమర్శించే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎన్నడూ ఇటువంటి ఘాటైన ప్రకటనలు చేయలేదు. పితాని సత్యనారాయణ గత చెరిత్ర తెలిసిన వారందరికీ ప్రస్తుతం జగన్ పై ఆయన చేస్తున్న విమర్శలు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. ఒకనాడు జగన్మోహనరెడ్డిని పితాని సత్యన్నారాయణ ఆకాశానికి ఎత్తినట్లుగా పొగిడారు.

 

 

జగన్ తన ఓదార్పు యాత్రలను మొదటిసారిగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభించినప్పుడు ఆ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పితాని సత్యన్నారాయణ స్వయంగా దగ్గర ఉండి చేశారు. అప్పట్లో ఆయన 'వై.ఎస్. దయ వల్లే మమంతా గెలిచాం. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు తగిన వ్యక్తి జగన్. ఆయనకు అండగా నిలుస్తాం. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రప్రజలంతా కోరుకుంటున్నారు' అని పలు సభల్లో అన్నారు. కానీ, ఆయన వైఖరిలో హఠాత్తుగా మార్పు వచ్చింది. 'వై.ఎస్. కాంగ్రెస్ పార్టీలోని ఒక నాయకుడు మాత్రమే.

 

ఆయన కొడుకైనంత మాత్రాన జగన్మోహన రెడ్డి సి.ఎం. అయిపోతారా? ఇదేమన్నా రాచరికపు వ్యవస్థా? రాజు చనిపోతే కొడుక్కి రాజ్యం అప్పగించటానికి' అని ఇటీవల జరిగిన సభలో అన్నారు. పితానిలో ఇంతటి మార్పు రావటానికి కారణం ఏమై ఉంటుందన్న విషయమై పార్టీ నాయకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జిల్లాలో మంత్రి వట్టి వసంత కుమార్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ జగన్ కు వ్యతిరేకంగా నోరుమెదపలేదు. ఒక్క మంత్రి పితాని మాత్రం నోరుపారేసుకుని వివాదాస్పదమవుతున్నారు. కేవలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పుకోసం ఆయన ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.