ఆ సీఎంను చంపినవారికి..కోటీ నజరానా
Published on: Thu Mar 2, 2017 2:57PM

కేరళలో ఆర్ఎస్ఎస్, సీపీఎం నాయకులకు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొత్తం ఎనిమిది మంది బీజేపీ నాయకులు హత్యకు గురయ్యారని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా మరో బీజేపీ నేత సంతోష్ దారుణ హత్య కేరళలో కలకలం సృష్టించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
కాగా, దేశాన్ని మరోసారి చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కుట్ర పన్నుతున్నాయని సీఎం విజయన్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. హిట్లర్, ముస్సోలినిలను ఆర్ఎస్ఎస్ అనుసరిస్తుందన్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ సంచలన ప్రకటన చేశారు. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తిమొత్తం అమ్మేస్తానంటూ వ్యాఖ్యానించారు. కేరళలో సీపీఎం తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని సీఎం కంకణం కట్టుకున్నారని చంద్రావత్ ఆరోపించారు.


