ఏపీ 25 ఇప్పట్లో లేనట్లేనా? మరి పిల్లి అలా ఎందుకన్నారు?

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత 13 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు... రెండు ఉభయగోదావరి జిల్లాలు... రాయలసీమలో నాలుగు జిల్లాలు... అలాగే, కోస్టల్ ఏరియాలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండటంతో, ఆ లెక్కన కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతమున్న జిల్లాల పేర్లను మార్చకుండానే, కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రస్తుతమున్న జిల్లాల పేర్లను మార్చితే మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైయ్యే అవకాశం తీవ్రంగా ఉంటుంది. అందుకే, ఎలాంటి వ్యతిరేకత, అభ్యంతరాలు రాకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్టుగా, ఆంధ్రప్రదేశ్ ను 25 జిల్లాలుగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి కొత్త జిల్లాల పునర్ విభజన చేపట్టాలని జగన్ సర్కారు ముందుకెళ్తోందట. అంతేకాదు కొత్త జిల్లాల ముసాయిదాను డిసెంబర్ లోపే సిద్ధంచేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తిరిగి సవరణలుచేసి, మొత్తం ప్రక్రియను జనవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుందట. అలాగే, జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. 

అయితే, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతోన్న ప్రచారానికి భిన్నంగా మాట్లాడారు. ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదన్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పుకొచ్చారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో... ఎప్పుడు ఆంధ్రప్రదేశ్... ఏపీ 25గా మారుతుందో చూడాలి.