TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ర‌హ‌స్య జీవోలపై ర‌విశంక‌ర్ పోరాటం.. హైకోర్టు పిల్‌తో ఏపీ స‌ర్కారు షేక్‌..

Published on: Mon Jan 31, 2022 2:39PM

అధికారం చేతిలో ఉంది. అడిగేవారు లేర‌నుకున్నారు. అంతా ఇష్టారాజ్యం. అడ్డ‌గోలు జీవోల గోల్‌మాల్‌. జీవోలంటే అధికారికంగా ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలి. అందులో దేశ ర‌హ‌స్యాలో, ప్ర‌భుత్వ ర‌హ‌స్యాలో.. దాచుంచేటంత సీక్ర‌సీ ఏముంటుంది? జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరు నెల‌ల్లో సుమారు 8వేల జీవోలు ఇస్తే.. అందులో దాదాపు 7వేల‌కు పైగా జీవోలు ర‌హ‌స్యంగా ఉంచడం మామూలు విష‌యం కానేకాదు. జీవోలు పాల‌న పార‌ద‌ర్శ‌క‌త‌కు వీలుగా ఉండాలి కానీ.. జీవో వివ‌రాల‌ను చీక‌ట్లో దాచుంచ‌డం ఏంటి? ఇది ప్ర‌జాస్వామ్య పాల‌నా? నియంతృత్వ‌మా? అందుకే, ఈ నిరంకుశ పాల‌న‌ను ప్ర‌శ్నించేందుకు.. డొంక‌తిరుగు జీవోల‌పై ప్ర‌భుత్వాన్ని నిగ్గ‌దీసేందుకు.. ప్ర‌ముఖ పారిశ్రామిక‌, సామాజిక వేత్త కంఠంనేని ర‌విశంక‌ర్ ఏపీ హైకోర్టులో గ‌తంలోనే పిల్ వేశారు. ఆ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై హైకోర్టు వేగంగా విచార‌ణ జ‌రుపుతోంది. ఆ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఇక‌, తాజా విచార‌ణ‌లో స‌ర్కారు సైతం కౌంట‌ర్ ఫైల్ దాఖ‌లు చేయ‌గా.. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే ర‌హ‌స్య‌ జీవోల లెక్క భారీగా ఉంద‌ని తేలిపోయింది. 

ఆగష్టు 15 నుంచి జనవరి 15 వరకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం GO ల సంఖ్య 8,457. అందులో కేవలం 620 GOలు మాత్రమే ఈ-గెజిట్‌.. జీవోఐఆర్‌టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. మిగిలిన 7,837 GO ల‌ను ర‌హ‌స్యం జీవోలంటూ top secret/secret/ confidential /miscellaneous పేరుతో ఎవ‌రికీ తెలీకుండా, ఆ వివ‌రాలేవీ ప‌బ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచ‌కుండా.. జారీ చేశార‌ని ప్ర‌భుత్వం ఫైల్ చేసిన కౌంట‌ర్‌లోనే చెప్ప‌డంతో ఆ ర‌హ‌స్య జీవోల డొంక భారీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

స‌ర్కారు చెప్పిందాని ప్ర‌కారం.. ఆగష్టు 15 నుండి జనవరి 15 వరకు.. 5 నెలల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం GO లలో.. కేవలం 7.33 శాతం GO లు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్టు తేలిపోయింది. ఇది స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి పూర్తి విరుద్ధం. అంటే, ఆ దాచిన‌ జీవోల‌న్నీ చీక‌టి జీవోల‌న్న‌ట్టేనా? అందులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించే అంశాలు దాగున్న‌ట్టేనా? అని అనుమానిస్తున్నారు. 

ఇలాంటి ర‌హ‌స్య జీవోల‌పై గ‌తంలోనూ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీవోల‌ను ర‌హ‌స్యం, అతి ర‌హ‌స్యం అని ఎలా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అన్ని జీవోల వివ‌రాల‌ను ఇవ్వాల‌ని సూచించింది. ర‌హ‌స్య జీవోల స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించ‌గా.. తాజాగా ప్ర‌భుత్వం కౌంట‌ర్ ఫైల్ చేసింది.  

ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఎంఎస్‌, జీవోఆర్‌టీ, పి... అనే మూడు కేటగిరీలలో జారీ చేస్తోంది. ఇందులో జీవోఆర్‌టీ, జీవోఎంఎ్‌సల వివరాల గురించే ఆ ఆఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్ని జీవోలపై ‘గోప్యత’ ముసుగు వేశారో చెప్పలేదు. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప్రజలందరికీ తెలియాల్సిన అనేక విధాన పరమైన నిర్ణయాల జీవోలను కూడా ప్రజల దృష్టికి తేవడం లేదు. అందులో కొన్ని...

--కరోనా సమయంలో రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. ఫలానా తేదీ నుంచి, ఫలానా సమయాల్లో కర్ఫ్యూ అమలులో ఉండాలని... ప్రజలందరికీ తెలియాలి కదా! ఈ జీవోలను కూడా గెజిట్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు.

--వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు జనవరి 29న జీవో 40ని జారీ చేశారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం  చేసే అంశమిది. నేటి వరకు ఈ జీవోను గెజిట్‌లో పొందుపరచలేదు.  

--రాష్ట్రంలో పలుచోట్ల పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 23న జీవో 225 జారీ చేసింది. అందులో ఉచిత క్రమబద్దీకరణ పరిమితి 100 గజాల నుంచి 75 గజాలకు కుదించారు. దీనిపై ప్రజావ్యతిరేకత వస్తుందని అసలు విషయాన్ని సీక్రెట్‌గా పెట్టి జీవో 225 ప్రకారం క్రమబద్ధీకరిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ జీవోలో ఏముందో ఈ రోజుకూ ప్రజలకు తెలియదు. 

--ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వ భూములను వేలం వేయకూడదన్న జీవోను సవరిస్తూ... గత ఏడాది సెప్టెంబరు 13న సవరించి గుట్టుగా జీవో 243ని జారీ చేసింది. దీనినీ చీకట్లోనే ఉంచారు.

--గత ఐదున్నర నెలల కాలంలో ఐఏఎస్‌ల బదిలీలపై జారీ చేసిన జీవోల్లో చాలా వరకు గెజిట్‌లో అప్‌లోడ్‌చేయలేదు. తమ కలెక్టరు ఎవరు? తమ సంక్షేమం చూసే అధికారి ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

గ‌తేడాది ఆగ‌స్ట్ 15 నుంచి ఆన్‌లైన్లో కాకుండా మాన్యువ‌ల్ రిజిస్ట‌ర్స్‌లో ర‌హ‌స్య జీవోల‌ను రికార్డు చేస్తున్నందున‌.. ఆ మేర‌కు మొత్తం 99 రిజిస్ట‌ర్స్‌ను కోర్టు ముందుకు తీసుకువ‌స్తేగానీ అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావ‌ని అంటున్నారు. ర‌హ‌స్య జీవోల గుట్టు ర‌ట్టు చేస్తున్న పిటిష‌న‌ర్ కంఠంనేని ర‌విశంక‌ర్‌ను, ఆయ‌న తర‌ఫున బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్న ప్ర‌ముఖ లాయ‌ర్ ఉమేశ్‌చంద్ర‌ను అంతా అభినందిస్తున్నారు.