పోలీస్ కస్టడీ హింసపై హైకోర్టులో పిల్.. జగన్ సర్కారుకు షాక్..
Published on: Thu Nov 11, 2021 1:41PM
గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ అన్నారు. ఇటీవల టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కస్టడీలో తనను కొడతారనే భయంతో బట్టలిప్పేసి మరీ తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వీడియో రిలీజ్ చేశారు. ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల దుస్థితి చెప్పేదేముంది? అంతకుముందు.. ఓ దళితుడికి స్టేషన్లో గుండు కొట్టించిన ఘటన సంచలనం సృష్టించింది. ఇలా, గడిచిన రెండున్నరేళ్లుగా ఏపీలో పోలీస్ కస్టడీ హింసపై అనేక వార్తలు వచ్చాయి. ప్రత్యర్థులపై పోలీసులను ప్రయోగిస్తూ.. కస్టడీలో టార్చర్ చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో తాజాగా హైకోర్టులో ఓ కీలక వ్యాజ్యం దాఖలైంది. అరెస్ట్ చేసిన నిందితులకు ముందుగా వైద్య పరీక్షలు చేయించాలని, ఆ తర్వాతే వారిని స్టేషన్ కు తీసుకెళ్లేలా పోలీసులను ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్ హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు 54, 57 సీఆర్పీసీ సెక్షన్లకు విరుద్ధంగా ఉందని లలిత్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సీఆర్పీసీలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించాలని పిల్ లో లలిత్ కుమార్ అభ్యర్థించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏపీ వైద్య మండలి చైర్మన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని, కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
పిటిషనర్ లలిత్ కుమార్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఏపీ పోలీసు అధికారులు సీఆర్పీసీ 54, 57 సెక్షన్లలోని అంశాలను అనుసరించడంలేదని కోర్టుకు తెలిపారు. పోలీసులు సీఆర్పీసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. విచారణ నెపంతో కస్టడీలో ఉన్నవారిని పోలీసులు హింసిస్తున్నారని హైకోర్టు దృష్టికి లాయర్ ఉమేష్ చంద్ర తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన నిందితుడ్ని పోలీసులు 24 గంటలకు మించి స్టేషన్ లో నిర్బంధించకూడదన్నారు. అయితే.. పోలీసులు ఈ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఇలాంటి కస్టడీ హింస సంఘటనలు వెలుగు చూశాయని హైకోర్టుకు విన్నవించారు. ఏపీలో ఇంకా మరెన్నో కస్టడీ హింస ఘటనలు జరుగుతున్నాయని లాయర్ ఉమేష్ చంద్ర హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
నిందితుడ్ని అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం పోలీసులు మూడు పనులు చేయాల్సి ఉంటుందని న్యాయవాది ఉమేష్ చంద్ర ధర్మాసనం ముందు వాదించారు. సీఆర్పీసీ సెక్షన్ 54 ప్రకారం నిందితుడ్ని అరెస్ట్ చేసిన వెంటనే వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ నిర్వహించాలని, తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపట్టాలని హైకోర్టుకు తెలిపారు. కానీ.. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించకుండానే పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించడం సీఆర్పీసీ రూల్స్ కు విరుద్ధం అని వాదించారు. పోలీసు హింసకు నిందితుడు గురికాకుండా సీఆర్పీసీ సెక్షన్ 57 రక్షణ కల్పిస్తోందని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుల అరెస్ట్, రిమాండ్ లాంటి విషయాల్లో పోలీసులు, కొందరు మేజిస్ట్రేట్లు చట్ట నిబంధనలను పాటించడం లేదన్నారు.
న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఏపీ మెడికల్ కౌన్సిల్ కు ప్రత్యేకంగా నోటీసు ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ వాయిదా పడింది. హైకోర్టులో దాఖలైన ఈ పిల్ జగన్ సర్కారుకు షాకింగ్ పరిణామమే అంటున్నారు.


