మనిషికి పంది గుండె.. అమెరికా డాక్టర్ల మిరాకిల్..
Published on: Tue Jan 11, 2022 10:12AM
వైద్యశాస్త్రంలోనే ఇది మరొక మిరాకిల్.. ఓ 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చి వైద్యశాస్త్రంలో ఓ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు అమెరికాలోని వైద్య నిపుణులు. బాల్టిమోర్ లోని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది.
మూడు రోజుల క్రితం పంది గుండెను వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ కు అమర్చారు. ఇప్పుడు బెన్నెట్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను అమర్చిన వైద్యులు బెన్నెట్ ప్రాణాన్ని కాపాడారు.
సంప్రదాయ గుండె మార్పిడికి డేవిడ్ బెన్నెట్ పరిస్థితి అనుకూలించకపోవడంతో వైద్యులు పంది గుండెను అమర్చాలని నిర్ణయించారు. వైద్యుల ప్రయత్నానికి అత్యవసర అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసింది. డేవిడ్ బెన్నెట్ కోలుకుంటున్నాడని, అయితే.. మరి కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్ట్ లీ గ్రిఫిత్ తెలిపారు.
పంది గుండె మార్పిడి జరిగిన డేవిడ్ బెన్నెట్ పూర్తిగా కోలుకుంటే.. ఇది మనిషి సాధించిన అద్భుత విజయాల్లో ఒకటవుతుందనడంలో సందేహం లేదు. మనిషికి పంది గుండె మార్పిడి సక్సెస్ అయితే.. భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్ కొరత చాలా వరకూ తగ్గిపోవచ్చు.


