TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది?

Published on: Fri Jun 6, 2025 9:29AM

ట్యాపింగ్ కేసులో ఏ1 ముద్దాయి.. విచారణకు డుమ్మా కొట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాలి. అలా హాజరౌతానని స్పష్టమైన హామీ ఇచ్చే సుప్రీం కోర్టు ద్వారా పాస్ పోర్టు సంపాదించుకున్నారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక సారి ఉపయోగించుకునే వన్ టైమ్ పాస్ పోర్టు ఆయనకు అందింది కూడా. దీంతో ఆయన స్వయంగా సుప్రీం కోర్టుకు చెప్పిన విధంగా మూడు రోజుల్లో అంటే  జూన్ 5న విచారణకు హాజరౌతారనే అంతా భావించారు. కానీ ఆయన విచారణకు రాలేదు.  దీంతో న్యాయనిపుణులు ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అంటున్నారు.  అయితే ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ రెండు రోజుల్లో వచ్చి విచారణకు హాజరౌతారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  
అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు. అంతా నిజమేనని నమ్మారు. ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆయనకు పాస్ పోర్టు అందింది. అయితే చెప్పినట్లుగా.. విచారణకు రాకుండా ప్రభాకరరావు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన తీరు పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గైర్హాజరీ కోర్టు ధిక్కరణేనని అంటున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడే సాహసం చేయరనీ, రెండు లేదా మూడు రోజులలో విచారణకు హాజరౌతారనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.