TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ కేసు కూడా సీబీఐకి?

Published on: Fri Sep 19, 2025 3:05PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన, అత్యంత ప్రధానమైన కేసును సీబీఐకి అప్పగించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవకతవకలు, అవినీతికి సంబంధించిన  కేసును సీబీఐకి అప్పగించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొందరు అధికారులతో ఇప్పటికే చర్చించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ సహచరులతో కూడా ఈ విషయమై చర్చించి వారి అభిప్రాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్మమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు ఉన్న సంగతి విదితమే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ దర్యాప్తునకు నిందితులు ముఖ్యంగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సహకరించడం లేదని, అందుకే కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి ఒక కొలిక్కి రాకుండా సుదీర్ఘంగా సాగుతోందనీ రేవంత్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే.. విషయం మరింత సీరియస్ అవుతుందనీ, అధికారులు సహకరించకుండా ఉండే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు.