TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీట్ విచారణకు ఏ1 ప్రభాకరరావు

Published on: Mon Jun 9, 2025 10:15AM

తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సోమవారం (జూన్ 9) సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత 15 నెలలుగా అంటే ఈ కేసు నమోదు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచీ ఆయన అమెరికాలోనే ఉన్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పటు చేసుకోవడానికి గ్రీన్ కార్డ్ కూడా తీసుకున్నారు. చికిత్స పేరుతో అక్కడకు వెళ్లిన ప్రభాకరరావు.. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు. అయితే ఆయనను ప్రకటిత నేరస్థుడిగా గుర్తించే పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి. ఆ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్ తిరిగి వచ్చారు.  మాజీ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త పడ్డారు. విచారణను తప్పించుకునేందుకు అమెరికా చెక్కేశారు. అక్కడే  ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కావడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.  

బీఆర్ఎస్  హయాంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపిన సంగతి విదితగమే.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్  ప్రభాకర్ రావు ద్వారా ఆ పని చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కూడా బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకున్నారనీ, ఆయనకు ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు   సహకరించారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును సిట్ విచారించింది. ఆ విచారణలో రాబట్టిన అంశాల ఆధారంగా ప్రభాకరరావు ప్రమేయాన్ని నిర్ధారించుకుందని తెలుస్తోంది.  

తనకు పొలిటికల్ అస్సైలమ్ ఇవ్వాలంటూ ప్రభాకరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రభాకరరావు అనివార్యంగా హైదరాబాద్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమిరేట్స్ విమానంలో దుబాయి మీదుగా ఆయన హైదరాబాద్ కు ఆదివారం (జూన్ 8) చేరుకున్నారు.   సోమవారం (జూన్ 9) జూబ్లీహిల్స్ లోని సిట్  కార్యాలయంలో  విచారణకు హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు సిట్ విచారణలో  ఏం చెబుతారన్న దానిపై ఇప్పడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నోరు విప్పితే బీఆర్ఎస్ అగ్రనాయకులకు గడ్డు కాలం తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.