ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే...కానీ నేరం కాదా?

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిజమేనని తెలంగాణా ప్రభుత్వమే స్వయంగా హైకోర్టులో అంగీకరించిందని మంత్రి రఘునాధరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎవరయినా అస్థిరపరుస్తున్నట్లు అనుమానం కలిగితే అటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం తమకు ఉందని తెలంగాణా ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ హైకోర్టులో వాదించారు. తెలంగాణాకు సంబంధించిన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు రికార్డు చేసిన ఆ కాల్-డాటాను ఇవ్వమని విజయవాడ కోర్టు ఆదేశించలేదని, కనుక ఆ కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని ఆయన వాదించారు. మొదట “అసలు ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకేమిటి?” అని  ఎదురు ప్రశ్నించిన తెలంగాణా మంత్రులు ఆ తరువాత ట్యాపింగ్ కాదు కేవలం సంభాషణల రికార్డింగ్ మాత్రమే చేశామన్నారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించడమే కాకుండా, ఆవిధంగా చేసేందుకు తమకు అధికారం కూడా ఉందని వాదిస్తున్నారు.

 

నిజానికి కేంద్రప్రభుత్వం అనుమతి లేనిదే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు సరిహద్దు రాష్ట్రమయిన గుజరాత్ లో ఉగ్రవాదాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్ర పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పమిపితే దానిని రాష్ట్రపతి అబ్దుల్ కలాం వెనక్కి త్రిప్పి పంపారు. అంతకు ముందు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వెనక్కి త్రిప్పి పంపారు. ఒకప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అంటే దీనిని బట్టి కేంద్రం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని అర్ధమవుతోంది.

 

కానీ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) క్రింద సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తమకు అవసరమయిన సమాచారం కోరే హక్కు తెలంగాణా ప్రభుత్వానికి ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కే.ఎం.నటరాజన్ కోర్టుకి తెలియజేసారు. అంతే కాదు తెలంగాణా ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందని కూడా ఆయన కోర్టుకి తెలియజేసారు. విజయవాడ కోర్టు కోరుతున్న కాల్-డాటా ప్రస్తుతం సర్వీస్ ప్రొవైడర్ల వద్ద లేదని, అదిప్పుడు సంబంధిత అధికారుల వద్ద మాత్రమే ఉందని, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తెలంగాణా ప్రభుత్వం వ్రాసిన లేఖలు మాత్రమే ఉన్నాయని, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్ లో సెక్షన్ 123,124 ప్రకారం ఆ లేఖలను బయటపెట్టనవసరం లేదని తెలంగాణా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి కోర్టుకి తెలియజేసారు. ఆంద్ర ప్రదేశ్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేయడమే తెలంగాణా ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని జెట్మలానీ వాదించారు.

 

వారి వాదోపవాదాలు, అందులో న్యాయపరమయిన అంశాల సంగతిని పక్కనబెడితే, తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ కి పాల్పడిందనే విషయం స్పష్టం అవుతోంది. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోనేందుకే ఫోన్ ట్యాపింగ్ చేసామని వాదిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరిచే ప్రయత్నాలు చేసిందని ఏపీ ప్రభుత్వ వాదనకు జవాబు ఏమిటి? తెలంగాణా ప్రభుత్వం సుమారు 250 ఫోన్లను ట్యాపింగ్ చేయిందని ఒక మంత్రి ఆరోపిస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోన్లను ఇంత విచ్చలవిడిగా ట్యాపింగ్ చేయడం నేరం కాదా? దాని సార్వభౌమత్వాన్ని సవాలు చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి ఇదివరకే తాము కేంద్రానికి పిర్యాదు చేశామని, మళ్ళీ మరొక్కమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేప్పట్టవలసిందిగా కోరుతామని తెదేపా నేతలు చెపుతున్నారు.