ములాఖత్‌లు తగ్గించేందుకు జైళ్ళలో ఫోన్లు
Published on: Thu Aug 9, 2012 12:44PM
జైళ్లలో ఫోను సౌకర్యం ఉంటే ములాఖత్‌లు తగ్గుతాయని ఉన్నతస్థాయిలో గుర్తించారు. ఖైదీలు జైలులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందకుండా ఈ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. ప్రత్యేకించి ఖైదీ ఆరోగ్యపరిస్థితి కనుగొనేందుకు దూరప్రాంతాల నుంచి కుటుంబసభ్యులు రావటానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ఫోను ఏర్పాటు కొంత ఊరట కలిగిస్తుందని గుర్తించారు. అయితే ఈ ఏర్పాటు కోసం ఖైదీకి నెలకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఖర్చయినా పర్వాలేదు కానీ, ఈ ఫోను వల్ల బయటప్రాంతాల్లో అరాచకాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవచ్చని జైలు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఖైదీ ఆలోచనలు కూడా తమకు రికార్డింగుల రూపంలో తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రయోగాత్మకంగా ఈ ఫోను సౌకర్యం చర్లపల్లి జైలులో ప్రవేశపెట్టామని జైళ్లశాఖ డిప్యూటీ డైరెక్టర్ టిపిదాస్ తెలిపారు. ఖైదీల కుటుంబసభ్యుల ములాఖత్‌లు తగ్గాయని, కుటుంబసభ్యులు కూడా ఖైదీల ఆరోగ్యం గురించి వాకబు చేయటానికి అవకాశం కుదిరిందని వివరించారు. ఈ సక్సెస్ ఆధాంగానే రాజమండ్రి సెంట్రల్‌జైలులో మరోమూడు, 4నెలల్లో ఈ ఫోను సౌకర్యం కల్పిస్తామంటున్నారు. ఈ సౌకర్యం వల్ల సెంట్రల్‌జైలులో ఖైదీల మానసికపరిస్థితిని మెరుగుపరిచిందని నిర్ణయానికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.


