పీఎఫ్ వడ్డీరేట్లు తగ్గింపు
Published on: Sat Mar 19, 2016 11:08AM

ఇది నిజంగా మధ్య తరగతి ప్రజలకు ఓ దుర్వార్తే! ఇప్పటికే ఏ మూల నుంచి ఏ పన్ను పడుతుందోనని భయంభయంగా బతుకుతూ, ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఖర్చులలో రూపాయిరూపాయి దాచుకుని ప్రావిడెంట్ ఫండులో దాచుకునేవారికి ఇక మీదట ఆ సదుపాయంలో కూడా కోత పడనుంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మీద 8.7 శాతం వడ్డీ లభిస్తుండగా దాన్ని ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు. ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస పత్రాల వంటి పొదుపు పథకాలన్నింటికీ కోత పడింది.
కిసాన్ వికాస పత్రాలని గుండెల మీద పెట్టుకున్నవారికి గాభరా కలిగించేలా దాదాపు ఒక శాతం కోత పడింది. ఇప్పటివరకూ 8.7% ఉన్న ఈ పత్రాల మీద వడ్డీ ఇప్పడు 7.8%గా మిగిలింది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే నెలవారీ పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి ఖాతా... వంటి పోస్టాఫీసు పొదుపు పథకాల మీద కూడా ప్రభుత్వం కొరడా విదిలించింది. ఆ మధ్య తన బడ్జెట్లో పీఎఫ్ మీద పన్నుని విధించబోయి భంగపడిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి విమర్శలకు తావిచ్చేలా ఈ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఈసారి తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు!


