లీటర్ పెట్రోల్ పై రూ. 25 తగ్గింపు.. సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్
Published on: Wed Dec 29, 2021 4:33PM
దేశంలో చమరు ధరలు భారీగా పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ రేట్ వంద రూపాయలకు పైగానే ఉంది. డీజిల్ రేట్ కూడా పెట్రోల్ తో పోటీ పడింది. చమురు ధరలు పెరగడంతో వాహనదారులపై భారం పడింది. అయితే చమురు ధరలు పెరుగుదలతో అల్లాడిపోతున్న వాహనదారులకు జార్ఖండ్ ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చారు. లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 తగ్గిస్తూ ప్రకటన చేశారు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్. ఇది జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడంలేదని... పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఊరట ఇవ్వాలని నిర్ణయించామని సొరెన్ వెల్లడించారు.
జార్ఖండ్ ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గించినా అందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయి. కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే ఆ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రేషన్ కార్డు కలిగిన ద్విచక్రవాహనదారులు తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లలో పెట్రోల్ పోయించుకుంటే ఒక్కో లీటర్కు ₹25ల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇది 2022 జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రతి పేద కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు రీయంబర్స్మెంట్ పొందొచ్చని ముఖ్యమంత్రి సోరనే వివరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్లో లీటరు పెట్రోల్ ధర రూ.98.52లుగా ఉంది.
--


