భగ్గుమన్న పెట్రోల్ ధరలు... సామాన్యుడి జేబుకు చిల్లు

 

పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా పెట్రోల్ మంటలు పుట్టిస్తోంది. వారం రోజుల్లోనే పెట్రోల్ ధర రెండు రూపాయలు పెరిగింది.  రాబోయే వారం, పది రోజుల్లో నాలుగు నుంచి ఐదు రూపాయలు పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఈ ధరల పెరుగుదల డైరెక్ట్ గా సామాన్యులపై భారం మోపనుంది. సౌదీ అరేబియా లోని చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడి ప్రభావం ఇంధన ధరలపై పడింది. గత ఆరు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి, వీటిని కలిపితే లీటర్ పెట్రోల్ ధర రూపాయి యాభై తొమ్మిది పైసలు, డీజిల్ ధర రూపాయి ముప్పై ఒక్క పైసలు పెరిగింది.

ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ పై ఇరవై ఏడు పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ డెబ్బై మూడు రూపాయల అరవై రెండు పైసలకు చేరుకుంది, డీజిల్ ధర పధ్ధెనిమిది పైసలు పెరిగి లీటర్ అరవై ఆరు పాయింట్ ఏడు నాలుగు రూపాయలకు చేరుకుంది. గల్ఫ్ లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లోనూ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచం లోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన అరామ్కో అప్కైగ్ పై ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది, క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా చేసే సౌదీ కొన్ని రోజుల పాటు ఎగుమతిని ఆపివేస్తున్నట్లు ప్రకటించింది.

అరామ్కో ఆయిల్ రిఫైనరీలో ఇప్పటికీ మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో చమురు ఎగుమతిని పునరుద్ధరించాలని మరో నెల రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో క్రూడ్ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర డెబ్బై ఎనిమిది రూపాయలు దాటింది, క్రూడ్ ధరలు కూడా ఇదే విధంగా పెరిగితే వచ్చే నెల రోజుల్లోనే ఎనభై ఐదు రూపాయలు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతుండటం, దానికి పెట్రో మంటపెడితే సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది.