TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ జీవోపై హైకోర్టులో పిటిషన్

Published on: Sat Sep 27, 2025 4:55PM

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  బీసీ రిజర్వేషన్ల  జీవో విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందనీ, నేడో, రేపో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయనీ అంతా భావిస్తున్న తరుణంలో ఆ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే  డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సీఎంకు అందజేశారు. అలాగే ఆయా స్థానాలకు  అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.   ఈ తరుణంలో  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్​ 9పై  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కేశవాపూర్‌ గ్రామానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో శనివారం (సెప్టెంబర్ 27) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయనే గతంలో కూడా  బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి   ప్రభుత్వం   జీవో విడుదల చేయలేదు. దీంతో ఆయన పిటిషన్ ను అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. పత్రికలలో కథనాల ఆధారంగా దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మాధవరెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.