కోడెల ఆత్మహత్యపై హైకోర్టులో పిటిషన్‌... సీబీఐ విచారణకు డిమాండ్ 

 

కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోడెలది ఆత్మహత్య కాదు... హత్య అంటోన్న పిటిషనర్‌ అనిల్.... సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని కోరాడు. కోడెల కుమారుడు శివరామ్‌పై అనుమానం వ్యక్తంచేస్తోన్న అనిల్... కేసుల నుంచి తప్పించుకోవడానికే తండ్రిని హత్య చేశాడని ఆరోపించాడు. అయితే, సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్‌ సీఐని పిటిషనర్‌...ప్రతివాదులుగా చేర్చాడు. గుంటూరు జిల్లాకి చెందిన అనిల్.... కోడెల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగి ఉందంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా అనిల్ ఆరోపణలు చేశాడు. కోడెల శివప్రసాద్ అభిమానిగా ఆయన మరణాన్ని తట్టుకోలేకే తాను పిల్ వేసినట్లు తెలిపాడు.

కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని, రాజకీయ నాయకులపై కేసులు సహజమని, దానికే ఆయన భయపడి ఆత్మహత్య చేసుకుంటారని తాను భావించడం లేదన్నారు. కోడెలది కచ్చితంగా రాజకీయ హత్యేనని, అయితే ఆ మిస్టరీ ఏంటో ఛేదించడానికి సీబీఐ దర్యాప్తు చేయించాలని అనిల్ హైకోర్టును కోరాడు.