పెంపుడు కుక్కే ప్రాణం తీసేసింది!
Published on: Sat Jul 30, 2022 6:47AM
కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ ఇంట్లో కుక్కలను పెంచుకునే వారు వాటిని సొంత మనుషుల్లా ప్రేమగా సాకడం చూస్తుంటాం. అయితే అలాంటి పెంపుడు కుక్కే ఓ ఇంట విషాదాన్ని నింపింది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే యజమానురాలిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. పెట్ డాగ్ లవర్స్‌కి ఇది కాస్త బాధాకరమైన వార్తే.. ప్రేమగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలు ఒక రిటైర్డ్ టీచర్, ఆమె కొడుకు జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు పెంపుడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి పిట్‌బుల్. మూడేళ్లుగా ఇంట్లో మనిషిగా అందరి ప్రేమనూ చూరగొన్న ఆ పిట్ బుల్ ఉన్నట్టుండి తన తల్లిపై అటాక్ చేసిందని చెప్పాడు. ఆ దాడిలో తన తల్లి తీవ్రంగా గాయపడి మరణించిందన్నాడు. దాడి తరువాత లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆ కుక్కను నాగర్ నిగమ్ జంతు జనన నియంత్రణ కేంద్రానికి తరలించింది. అక్కడ దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు.


