మంత్రికి పోలీసులు ఝలక్.. ఖాకీలపై పేర్ని నాని ఫైర్..
Published on: Fri Mar 4, 2022 1:26PM
ఇటీవల కొందరు ఏపీ పోలీసులు సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్నారు. మంత్రులకు పదే పదే ఝలక్ ఇస్తున్నారు. అయితే, ఖాకీలు అంత సిన్సియర్‌గా విధుల నిర్వర్తించడం ఏపీ మంత్రులకు నచ్చటం లేదు. ఎందుకంటే, వాళ్ల సిన్సియారిటీతో వైసీపీ నేతల ఓవరాక్షన్‌కు చెక్ పడుతోంది కాబట్టి.. వాళ్లు ఖాకీలపై కస్సుబుస్సు అంటున్నారు. వరుసగా జరిగిన రెండు ఘటనలతో.. మంత్రులు ఎంతగా అసహనానికి లోనవుతున్నారో తెలుస్తోంది.
కొన్నివారాల క్రితం సీఎం జగన్ విశాఖ వచ్చారు. శారదా పీఠం దగ్గర మంత్రి సిదిరి అప్పల్రాజును అడ్డుకుని తన డ్యూటీ తాను చేశారు ఓ సీఐ. అనుచరులను వెంటేసుకొని లోనికి పోబోయిన మంత్రిని.. అంతమందికి పర్మిషన్ లేదంటూ సీఐ అడ్డుకున్నారు. రెచ్చిపోయిన అప్పల్రాజు ఆ పోలీస్ అధికారిపై నోరు పారేసుకున్నారు. బూతులు తిట్టారు. చొక్కాపట్టుకొని నెట్టేశారు. అప్పట్లో ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. తాజాగా, పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా ఇంచుమించు అలాంటి ఘటనే జరిగింది. ఈసారి మంత్రి పేర్ని నానికి పోలీసుల నుంచి చుక్కెదురైంది. ఈయన కూడా ఆయనలానే పోలీసులపై ఫైర్ అయ్యారు. నోటికి పని చెప్పారు.

ఇక్కడ కూడా పోలీసుల తప్పేమీ లేదు. కేంద్రమంత్రి వచ్చినందుకు.. దారికి అడ్డుగా ఉన్న మంత్రి పేర్ని నాని కారును అక్కడి నుంచి తీసేయాలని కోరారు డ్యూటీలో ఉన్న పోలీసులు. అంతే. అంతమాత్రానికే మంత్రి గారికి కోపం పొడుచుకొచ్చింది. తమాషాలు చేస్తున్నారా? మర్యాదగా ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాని. ఇంతకీ ఏం జరిగిందంటే...
పోలీసు అధికారులపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్ పోలవరం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో పేర్ని నాని అక్కడికి వెళ్లారు. అక్కడ మంత్రి కారు అడ్డుగా ఉందని.. దాన్ని పక్కకు తీయాలని ప్రోటోకాల్ సిబ్బంది చెప్పడంపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రమంత్రి, సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు సమీపంలోకి ఎవరికీ అనుమతించ లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలను కూడా అనుమతించలేదు. ఇక, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. మంత్రి వాహనం అడ్డుగా ఉందని.. దాన్ని తీసేయాలని పోలీసులు కోరడంతో పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడున్న పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. "ఈ కార్లన్నీ ఎవరివి? తమాషాలు చేస్తున్నారా? కారు తీయమన్నది ఎవరు? ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి? నాకంటే వాళ్లు ఎన్ని డిసిగ్నేషన్లు తక్కువ? మర్యాదగా ఉండదు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పేర్ని నాని. అదేమరి.. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తే ఇలానే కాలుద్ది మరి.. అంటున్నారు. ఇదే ఖాకీలు టీడీపీ వారిపై విరుచుకుపడితే సంతోషపడే వైసీపీ నేతలు.. అదే పోలీసులు తమకు అడ్డుచెప్పడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.


