TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'సాక్షి టీవీ' అనుమతులు రద్దు..

Published on: Thu Feb 24, 2022 9:56AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత టీవీ చానల్ 'సాక్షి'కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ షాక్ ఇచ్చింది. 'సాక్షి' టీవీకి జారీచేసిన అనుమతిని రద్దు చేసింది. దేశంలో అనుమతించిన చానళ్ల జాబితా నుంచి 'సాక్షి'ని తొలగించింది. జనవరి నెల 20వ తేదీనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 'సాక్షి'కి కేంద్ర హోం శాఖ 'సెక్యూరిటీ క్లియరెన్స్' ఇవ్వకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే చానళ్లకు కేంద్రహోంశాఖ 'సెక్యూరిటీ క్లియరెన్స్' మంజూరు చేస్తుంది. సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటేనే ఆ చానల్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి లభిస్తుంది.

 స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన చానల్ కు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆ చానల్ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని భావించిందా? లేక.. జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకేనా? ఇవేవీ కాకుండా.. మరేవైనా కారణాలు ఉన్నా యా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియడలేదు. కానీ.. సాక్షి టీవీ ఉద్యోగులు హుటాహుటిన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, చానల్ ను మూసేస్తే వందల మంది జీవనోపాధి దెబ్బ తింటుందని చెప్పడంతో.. అక్కడ తాత్కాలికంగా ఊరట లభించింది.

‘ఇందిరా టెలివిజన్ లిమిటెడ్’ సంస్థ సాక్షి టీవీ పేరుతో నడిపే చానల్ కు 2006 జూన్ 1న పదేళ్ల పాటు అప్ లింక్, డౌన్ లింక్ అనుమతులు జారీ చేశాం. చానల్ ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను
పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపిస్తాం. తొలుత ఇచ్చిన అనుమతి కాలం ముగిసిపోవడంతో.. సాక్షిటీవీ మరోసారి అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది. 2018 జూన్ 1 నుంచి 2026 జూన్ 6వ తేదీ వరకు ప్రసారాలను అనుమతించాలని కోరింది. ఈ దరఖాస్తును కూడా కేంద్ర హోంశాఖకు పంపించాం.  అయితే.. సాక్షి టీవీకి సెక్యూరిటీ క్లియరెన్స్ ను హోంశాఖ నిరాకరించింది’ అని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. 'సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి' అంటూ ఆ సంస్థకు 2021 డిసెంబర్ 31వ తేదీన షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఇంఇరా టెలివిజన్ లిమిటెడ్ సంస్థ గత నెల 13న సమాధానం ఇచ్చింది. తమ చానల్ కు కేంద్ర హోంశాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదో తెలియదని, ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ వివరణను సమాచార, ప్రసార శాఖ పరిశీలించింది. అయితే.. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని, కొన్ని ప్రమాణాలకు లోబడి హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుంది. అదే లేకపోవడంతో.. సాక్షి టీవీ ప్రసారాల అనుమతిని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది.  ‘ఇందిరా టెలివిజన్ లిమిటెడ్’కు జారీ చేసిన అనుమతిని రద్దు చేస్తున్నాం. దేశంలో అనుమతించిన ప్రైవేట్ చానళ్ల నుంచి సాక్షి టీవీ పేరు తొలగిస్తున్నాం’ అని సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేసింది. 

కాగా.. సాక్షి టీవీకి అనుమతులు రద్దు చేయడాన్నిసవాల్ చేస్తూ ఆ చానల్ సిబ్బంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చానల్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోందని, రద్దు ఆదేశాలను కొట్టివేసి, అనుమతుల పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని 15 మంది ఉద్యోగులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తగిన కారణాలు చూపకుండానే కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ను నిరాకరించిందని తెలిపారు.

‘ఏదైనా ప్రతికూల చర్య తీసుకునే ముందు సంబంధిత సంస్థకు చెందిన వాటాదారులు, కార్మికులు, వినియోగదారులు, ఇతరుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ.. ఇందుకు విరుద్ధంగా చానల్ అనుమతులు రద్దు చేశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల కంపెనీ అస్తిత్వానికి, ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుంది. కంపెనీ అనుమతి/లైసెన్స్ మంజూరుకు సంబంధించి ఎలాంటి భద్రతా పరమైన నిబంధనలను ఉల్లంఘించలేదు’ అని సాక్షి ఉద్యోగులు తెలిపారు. ఇలా ఉండగా.. గతంలో కూడా ఇలాగే ఇందిరా టెలివిజన్ లిమిటెడ్టెలిపోర్ట్ లైసెన్స్ ను రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. ఇప్పుడు చానల్ కు అనుమతులు రద్దుచేయడం సరికాదని తెలిపారు. దీనిపై తెలంగాణహైకోర్టు సాక్షి టీవీకి తాత్కాలికంగా ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయి.

టీవీ చానళ్ల అప్ లింక్, డౌన్ లింక్ అనుమతులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంజూరు చేస్తుంది. అయితే.. చానల్ ఎవరు పెడుతున్నారు? డైరెక్టర్లు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? అనే వివరాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది. ఉదాహరణకు.. వేర్పాటు వాదులు, ఉగ్రవాదులు, మాఫియా నేతలు న్యూస్ చానళ్లు పెట్టి.. దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే ఎలా? అందుకే.. అన్నీ పరిశీలించి కేంద్ర హోంశాఖ 'సెక్యూరిటీ క్లియరెన్స్' జారీ చేస్తుంది. ఇక.. అప్పటికే సెక్యూరిటీ అనుమతులు ఇచ్చినప్పటికీ, యాజమాన్యం మారినా, షేర్ హోల్డర్లు మారినా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమవుతుంది.

కాగా..  'సాక్షి టీవీ' విషయంలో ఈ అనుమతి నిరాకరించడానికి బయటికి చెప్పలేని అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2006లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఈ చానల్ ను ప్రారంభించారు. అప్పుడు.. ఆయనే ఈ చానల్ కు సారథి. ఆ తర్వాత జగన్ పై అనేక అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 'క్విడ్ ప్రోకో’లో భాగంగా ముడుపులు తీసుకుని, వాటినే తన మీడియా సంస్థల్లో పెట్టుబడులుగా చూపించారని సీబీఐ నిర్ధారించింది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు పెట్టింది. సాక్షి టీవీ  ఖాతాలను స్తంభింపచేసింది. ఆ తర్వాత సాక్షి టీవీ చైర్ పర్సన్ గా
జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి బాధ్యతలు స్వీకరించారు. జగన్ సీఎం అయిన తర్వాత భారతి, సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు బోర్డు నుంచి తప్పుకొన్నారు. అటు సాక్షి టీవీపై కేసులు, ఇటు యాజమాన్య మార్పులు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జగన్ చానల్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ను నిరాకరించడం సంచలనం సృష్టిస్తోంది.