ప్రయాగ్ రాజ్ లో రాహుల్ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి అనుమతి ఉపసంహరణ.!
Published on: Thu Aug 6, 2026 4:52PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో జరప తలపెట్టిన ముఖాముఖి ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా జరగాల్సిన ఈ బహిరంగ సభ అనుమతిని చివరి నిమిషంలో ప్రభుత్వం నిరాకరించడంపై యూపీ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో శనివారం (ఆగస్టు 8) రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగ యువతతో నేరుగా మాట్లాడేలా ఛాత్రోన్ కీ గూంజ్ పేరిట సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తొలుత అనుమతులు లభించినప్పటికీ.. మైదాన నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే కాయస్థ పాఠశాల ట్రస్ట్ హఠాత్తుగా వెనక్కు తగ్గింది. దీనితో కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. రాజస్థాన్‌లోని కోటా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నగరాల్లో కూడా రాహుల్ కార్యక్రమాలకు ఇలాగే ఆటంకాలు సృష్టించారని, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది.
మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీ వస్తుంటే ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతోందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ కూడా కాంగ్రెస్ నేతకు మద్దతుగా నిలిచారు. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని, ఇలాంటి సభలను అడ్డుకోవడం ప్రభుత్వ బలహీనతను, భయాన్ని బయటపెడుతోందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పోటీ పరీక్షల ప్రక్రియల్లో జరుగుతున్న వరుస అక్రమాలు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీలో జాప్యం వంటి అనేక అంశాలపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులతో భేటీ అయి వారి ఆవేదనలను తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థుల మద్దతు ప్రతిపక్షాలకు లభిస్తే తమ అధికారానికి ముప్పు తప్పదన్న భయంతోనే యూపీ ప్రభుత్వం ఈ సభను అడ్డుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో రాహుల్ గాంధీ భేటీ అవుతారని చెబుతున్న కాంగ్రెస్ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
Rahul Gandhi Prayagraj Meeting, Chhatron Ki Goonj UP, Congress Vs BJP Uttar Pradesh, Priyanka Gandhi Comments


