TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి అనుచ‌రులు ఓవ‌రాక్ష‌న్‌.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం..

Published on: Mon Apr 18, 2022 10:55AM

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థతి.  ఏపీలో అధికార అ పార్టీ అత్యుత్సాహం జనం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నది. అదెలా అంటే...జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు పొందిన వారి, వారి అనుచరులు, అభిమానుల అత్యుత్సాహం జనం ప్రాణాల మీదకు తెస్తున్నది. ఒక మంత్రి విజయోత్సవ ర్యాలీ కారణంగా పసి పాప సమయానికి వైద్యం అందక మరణించింది.  మరో సంఘటనలో మంత్రి ఆలయ దర్శనం కారణంగా సామాన్య భక్తుల దర్శనానికి విపరీతమైన జాప్యం జరిగి వారు తరగబడే పరిస్థతి ఏర్పడింది. మండు వేసవిలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలిచిపోవలసి రావడంతో పలువురు దాదాపు సొమ్మసిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక తాజాగా నెల్లూరులో అయితే మంత్రి కాకాణి అనుచరుల అత్యుత్సాహం ఏకంగా వందల మంది రైలు ప్రాయాణీకుల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. నెల్లూరులో నిన్న సాయంత్రం కొత్త మంత్రి కాకాణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నెల్లూరులో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. గజ మాలలూ, బాణ సంచాలతో నెల్లూరు 
దద్దరిల్లిపోయేలా చేశారు. 

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన ఇన్ని రోజుల తరువాత ఈ సంబరేలేమిటంటారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాకాణి నెల్లూరుకు రావడం ఇదే మొదటి సారి కావడంతో పార్టీ శ్రేణులు ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఇంత భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికీ కారణం ఉంది. పాత మంత్రి ఇటీవల కాకాణికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం...పోలీసు స్టేషన్లో సాక్ష్యాల దొంగతనం వంటి కారణాలతో కొత్త మంత్రి ప్రతిష్ట ఒకింత మసకబారిందనే ప్రచారం సాగుతుండటంతో దానికి తిప్పి కొట్టేందుకు ఈ హడావుడీ, హంగామా చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ శ్రేణుల అత్యుత్సాహమే ఒక పెను ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితినీ తీసుకు వచ్చింది. 

అదెలాగంటే....మంత్రి స్వాగత సంబరాలలో మైమరిచిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. అందులో భాగంగా ఆకాసంలోకి తారా జువ్వలు వేశారు. అదీ రైల్వే ట్రాక్ పక్కన. కార్యకర్తల అత్యుత్సాహం, అలవిమాలిన నిర్లక్ష్యం కారణంగా వారు వేసిన తారా జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న రైలుపై పడ్డాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు కనుక సరిపోయింది కానీ....లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేది. వైపాకా కార్యకర్తలు వెలిగించి ఎగరేసిన జువ్వలు ఆ సమయంలో అటుగా వెళుతున్న ప్రయాణీకుల రైలుపై పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమంతో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి.