TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీఎల్ జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు లొంగుబాటు!

Published on: Mon Apr 6, 2026 10:43AM

మావోయిస్టు ఉద్యమానికి  మరో పెద దెబ్బ తగిలింది.  మావోయిస్టు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా  ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో సహా మరో 30 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఈ లొంగుబాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడో రేపో వెలువడనుందని పోలీసువర్గాలు తెలిపాయి.  

మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన   హిడ్మా  గతంలో  పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ  బెటాలియన్ కమాండర్‌గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.

అయితే కొద్దిరోజుల క్రితమే కమాండర్ దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవ డంతో.. బెటాలియన్ బాధ్యతలు సోది కేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు  సోది కేశాలు కూడా లొంగుబాట పట్టారు. సోది కేశాలు, మరో 30 మంది మావోయిస్టులు   చత్తిస్ ఘడ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం నుంచి   తెలంగాణలోకి ప్రవేశించి..  ములుగు, భూపాలపల్లి మార్గంగా వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయారు.

వీరందరినీ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య హైదరాబాదు కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు  ఏకే–47లు, ఎస్‌ఎల్‌ఆర్‌లు సహా సుమారు 40 నుంచి 50 వరకు ఆధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ లొంగుబాటు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు దళాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.