TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హ్యాపీ న్యూ ఇయర్.. అంత హ్యాపీ కాదు గురూ.. 

Published on: Sun Dec 26, 2021 1:57PM

కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలై పోయింది. ఇంకొక ఐదు రోజులు ఆగితే .. హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలు మొదలై పోతాయి.. అయితే కొత్త సంవత్సరం నిజంగా హ్యాపీ గా ఆనందంగా ఉంటుందా అంటే, అలాంటి భరోసా ఏమీకనిపించడం లేదు. ముఖ్యంగా మధ్య తరగతి భ్రమల్లో జీవించే, సామాన్యుడికి కొత్త సంవత్సరంలోనూ పాత కష్టాలు తప్పవని, ముఖ్యంగా నిత్యావసర ధరల విషయంలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

ప్రస్తుత సంవత్సరంలో వంటనునెల ధరలు, పొయ్యి ఎక్కకుండానే సలసల మండిపోయాయి. సంవత్సరం పొదుగునా, రెండు మూడు నెలలకు ఒకసారి వంట నూనె తయారు చేసే కంపెనీలు, ధరలను పెంచాయి. అది కూడా మాములుగా కాదు, సంవత్సర కాలంలో ఇంచు మించుగా 100 శాతం మెర్ వంటనూనెల ధరలు పెరిగాయి. రూ.100 కు అటూ ఇటుగా ఉన్న కిలో నూనె  ధర ఏకంగా రూ.200 మార్క్ కూడా దాటిపోయింది. అయిపోయిందేదో అయిపొయింది, కొత్త  సంవత్సంలో అయినా వంట నూనె ధరలు తగ్గుతాయా అంటే, అబ్బే అలాంటి భ్రమలేమీ పెట్టుకోవద్దని, వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తుల ధరలను 4-10 శాతం పెరుగొచ్చని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ముందుగానే తెలిపాయి.ఒక్క వంట నూనెల ధరలు మాత్రమే కాదు, పప్పు, ఉప్పు, కూరగాయలు ఒకటని కాదు నిత్యావసరాల ధరలన్న్నీ చుక్కలు చూపిస్తాయని మార్కెట్ వర్గాలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి.  

అలాగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే డిసెంబర్ నెలలో ధరలను 3-5 శాతం ధరలు పెంచాయి. ఈ నెలలో ఫ్రీజ్, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్ ధరలు పెరిగాయి. వీటి ధరలు ఇంకా 10 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అదే విధంగా ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా  పలుమార్లు వాహనాల ధరలను పెంచిన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు 2022లో కూడా ధరలను పెంచనున్నట్లు తెలిపాయి. సబ్బులు, బిస్కెట్లు, శీతల పానీయాలు, అలంకరణ సామగ్రి తయారు చేసే హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి కంపెనీలు గత రెండు త్రైమాసికాల్లో ధరలను 5-12 శాతం పెంచాయి. మార్చి త్రైమాసికం నాటికి వాటి ధరల్లో 5-10 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పటికే ధరలను 4 శాతం పెంచినట్లు డాబర్ కంపెనీ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు... సో.. హ్యాపీ న్యూ ఇయర్ ...అంత హ్యాపీ కాదు.. గురూ.. అంటున్నారు మార్కెట్ నిపుణులు..