TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీవోకేలో ప్రజా తిరుగుబాటు?

Published on: Sat Oct 4, 2025 10:17AM

ఆర్థికంగా, రాజకీయంగా, సామిజికంగా ఏడు దశాబ్దాలుగా వివక్షకు గురౌతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.  పీవోకే)లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు.  ప్రజల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. దీంతో ప్రజాందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపి తమ ఆందోళనను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పీవోకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు అంటున్నారు.

ఆందోళనకారులతో చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించింది. అయితే ఆందోళనకారులతో ఆకమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనలను అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  అయితే ఆందోళన కారులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఈ ప్రజాందోళనకు అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకత్వం వహిస్తున్నది. పీవోకేకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన ఏఏసీ.. పాకిస్థాన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది.  పీవోకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతోంది. ఈ 12  స్థానాల వల్ల  స్థానిక ప్రజల ప్రాతినిథ్య హక్కుకు భంగం వాటిల్లుతోందని ఏసీసీ చెబుతోంది.  అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ, మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలనీ కూడా ఏసీసీ డిమాండ్ చేస్తున్నది. ఏడు దశాబ్దాలుగా ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోకుండా సాగుతున్న పరిస్థితి ఇంకానా ఇకపై కుదరదంటూ ఏసీపీ కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.

ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే.. పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నది.  అయితే ఈ ప్రజాందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది.  వేల మంది సైనికులు, పోలీసులను మోహరించింది. ఈ ఆందోళనను అణచివేయడానికి  పంజాబ్ ప్రావిన్స్ నుంచి కూడా పోలీసులను తరలించి ఇక్కడ మోహరించింది.  ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.