సమస్యలు ప్రస్తావిస్తే తెలుగుదేశమేనా?
Published on: Sun Aug 21, 2022 8:13AM
మీరు తెలుగుదేశం పార్టీ వాళ్లు.. అందుకే నన్ను నిలదీస్తున్నారంటూ కనిిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజలపై విరుచుకుపడ్డారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కనిగిరిలో పలు కాలనీల్లో పర్యటించారు. ఆ సందర్భంగా సమస్యలను ప్రస్తావించిన ప్రజలపై ఆయన విసుక్కున్నారు.
సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ లబ్ధి చేకూరుస్తోందనీ, అయినా కూడా చిన్న చిన్న సమస్యలను పట్టుకుని నన్న ప్రశ్నిస్తారేమిటని ప్రజలను నిలదీశారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరిస్తుంటే, పలువురు రోడ్లు గుంతలమయంగా మారాయని, వీధి దీపాలు వెలగడం లేదని, పింఛన్లు కొందరికే ఇస్తున్నారంటూ కొందరు సమస్యలను ఏకరువు పెట్టారు.
దీంతో ఎమ్మెల్యే బుర్రా తీవ్ర అసహనానికి లోనయ్యారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో ప్రజలు తాము ఏ పార్టీకీ చెందిన వాళ్లం కాదని, కొందరు స్థానిక నాయకులు తమపై రాజకీయ కక్షలు చూపుతున్నారని ఆయనకు వివరించారు. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే శాంతించిన ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


