నివురు కప్పిన నిప్పులా హైదరాబాద్

పదుల సంఖ్య దాటి వేలసంఖ్యలోకి చేరిన కరోనా కేసులు..
ప్రభుత్వం అన్ లాక్ అంటున్నా ప్రజలు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు..
వీధుల్లో పెరుగుతున్న టూలేట్ బోర్డులు..
పట్టణం కన్నా పల్లె పదిలం అంటూ సొంతఊర్లకు పయనమవుతున్న హైదరాబాద్ వాసులు..

మొన్న పదుల్లో, నిన్న వందల్లో, నేడు వేలల్లో.. మరి రేపు లక్షల్లో కరోనా కేసులు నమోదు కావచ్చు అన్న భయం హైదరాబాద్ వాసుల్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.
కరోనా మన వద్దకు రాదు.. వచ్చినా పారాసిటమాల్ వేసుకుంటే సరి...పైసల కన్నా ప్రాణాలు ముఖ్యం అంటూ కోవిడ్ వైరస్ వ్యాప్తికి ముందు ప్రభుత్వం ఎన్నో చెప్పింది. సింగిల్ డిజిట్ లో ప్రారంభమైన కేసులు ఆ తర్వాత ఫోర్ డిజిట్లోకి మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. లాక్ డౌన్ ప్రారంభంలో కేసుల సంఖ్య చాలా తక్కువే ఉంది. అయితే మర్కజ్ సంఘటన తర్వాత కేసులు వేగంగా పెరిగాయి. సరైన టెస్టింగ్ టెక్నాలజీ, కిట్స్ లేకపోవడం వల్ల కేవలం లక్షణాలు ఉన్నవారిని మాత్రమే పరీక్షించారు. ఆ పరీక్ష ఫలితాలు రావడానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇంతింతై.. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం కూడా ఒక కారణమే అని ప్రజలు అంటున్నారు. నానాటికీ పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజలు మాత్రం స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఉపాధి కోల్పోయి కొందరూ... వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తో మరికొందరు సొంత ఊర్లకు వెళ్లిపోయారు.

అన్ని రంగాలపై..
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. మినీ ఇండియాగా భావించే హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశం నలుమూలల నుంచి వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే. వీరంతా చిన్నచిన్న పనులు, ఉద్యోగాలు చేసుకునేవారే. లాక్ డౌన్ మొదటి దశలోనే వీరిలో చాలామంది సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఐటీ రంగంలో పనిచేవారి సంఖ్య 15లక్షలకు మించి ఉండవచ్చని ఒక అంచనా. వీరిలో ఎక్కువ శాతమంది హైదరాబాద్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో పట్టణం వదిలి ఇంటిదారి పట్టారు. ఐటి రంగంలో పనిచేసేవారిలో దాదాపు పది లక్షల మంది సొంత ఊర్లకు వెళ్లారని తెలుస్తోంది.

ఖర్చులు భరించలేక..
మాల్స్, రెస్టారెంట్స్ ల్లో పనిచేసేవారు, పార్క్ ల ముందు, థియేటర్ల చుట్టూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందేవారు దాదాపు ఐదు లక్షల దాకా ఉంటారని అంచనా. వీరిలో 80 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. దాంతో పెరుగుతున్న ఖర్చులు భరించలేక, ఇంటి అద్దెలు కట్టలేక చాలామంది సొంత ప్రాంతాలకు వెళ్లారు.

చదువుల కోసం వచ్చిన వారు...
రాష్ట్రరాజధానిలో విద్యా, ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ కు వచ్చేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.  కోచింగ్ సెంటర్ల చుట్టూ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ నిర్వహిస్తూ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులతో ఎప్పుడు సందడిగా ఉండే దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలన్నీ బోసిపోయాయి. దాదాపు 3 లక్షల మంది హాస్టళ్లు ఖాళీ చేసి ఊరెళ్లి పోయారని అంచనా..

రియల్ ఎస్టేట్, మీడియా, సినిమా రంగంపై ఆధారపడిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. ఉపాధి కోల్పోయిన వారంతా పట్టణంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ భరించలేక సొంతూరి దారి పట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లో వ్యాపారాలు, ఆస్తులు, సొంత ఇండ్లు ఉన్నవారు తప్ప మిగతావారిలో చాలామంది సొంతప్రాంతాలకు పయనం కావాల్సిందే అనిపిస్తోంది.