రైతులకు పింఛన్!.. కేసీఆర్ నయా స్కీమ్! విపక్షాలు షేక్!
Published on: Wed Jan 12, 2022 4:34PM
రైతు బంధు. రైతు బీమా. త్వరలో రైతులకు పింఛన్ కూడా ఇవ్వబోతున్నారంటూ సమాచారం. సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ఈ సరికొత్త పథకం ప్రకటించేందుకు సీఎం సిద్ధం అవుతున్నట్టు ప్రగతిభవన్ నుంచి లీకులు వస్తున్నాయి.
రైతులకు నెలకు 2వేలు పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. రైతు పింఛన్ సాధ్యాసాధ్యాలపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నట్టు టాక్.
రైతుబంధు ద్వారా 64 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు అందించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడానికి రైతు బీమాను ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా రూ.3,205 కోట్ల ప్రీమియం చెల్లించారు. రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేశారు. ఇప్పుడు రైతు పింఛన్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కేసీఆర్ గ్రాఫ్ భారీగా పడిపోతుండటం.. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు బాగా బలపడుతుండటం.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఇలా పలు రకాలుగా కేసీఆర్ ప్రజాధరణ వేగంగా కోల్పోతున్నారు. వరి సాగు-కొనుగోళ్లు, రుణమాఫీపై కేసీఆర్ చేతులెత్తేయడంతో రైతులు కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహ జ్వాలను చల్చార్చడానికే రైతు పింఛన్ పథకంతో మచ్చిక చేసుకునే స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు.


