TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు

Published on: Fri Jul 25, 2025 10:15PM

వైసీపీ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  పుంగనూరు ఎమ్మెల్యేగా   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అయితే సెక్యూరిటీ వ్యవహారాలు చూడాల్సిన గన్ మ్యాన్ పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పెద్దిరెడ్డి గన్ మ్యాన్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కాలేషాను సస్పెండ్ చేస్తూ చిత్తూరు ఎస్పీ శుక్రవారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేశారు.

 మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు,  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.  కుమారుడిని పరామర్శించేందుకు బుధవారం (జులై23) పెద్దిరెడ్డి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వసతులు దిండు, దుప్పటి, ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. వీటిని గన్ మ్యాన్ మోసుకుని జైలులోకి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత చూడాల్సిన ఉద్యోగి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గన్ మ్యాన్ కాలేషా సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చింది.

 చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాలేషా పెద్దిరెడ్డి గన్ మ్యాన్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించడంతో  ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. అయితే పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెన్షన్ పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పెద్దిరెడ్డిపై అక్కసుతోనే గన్ మ్యాన్ ను సస్పెండ్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.