అమెరికా, ఇరాన్ చర్చలు.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం?
Published on: Mon Jun 22, 2026 3:21PM

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సుదీర్ఘ అశాంతికి స్వస్తి పలికి, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్ చర్చా వేదికగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి వచ్చి చర్చలు జరపడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కూడా వ్యక్తమైంది. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య దౌత్య వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఒక కీలకమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. దౌత్యపరమైన నిబంధనల ప్రకారం లభించాల్సిన గౌరవం, భద్రత విషయంలో లోపాలు తలెత్తాయి. దీనిపై అమెరికా ప్రతినిధి బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా చర్చల ప్రాంగణంలో కొద్ది సేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరాన్ ప్రతినిధులు కూడా తమ పాత వైఖరిని ప్రదర్శిస్తూ అమెరికా విధించిన ఆంక్షలపై కఠినమైన వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.
ఈ శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే చర్చల ఆరంభంలోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం లేవు అన్న విషయం తేటతెల్లం కావడం అందరినీ నిరాశకు గురి చేసింది.
అది పక్కన పెడితే.. అమెరికా ఉపాధ్యక్షుడికి జరిగిన ఈ ప్రోటోకాల్ అవమానంపై వైట్ హౌస్ ఇప్పటికే అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఇరాన్ కూడా ఈ చర్చల్లో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని హెచ్చరించింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ ల పుణ్యమా అని ఈ వివాదం టీకప్పులో తుపానుగా మారి.. చర్చలు సానుకూలంగా సాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


