పాయకరావుపేటలో కొనసాగుతున్న ప్రతిష్టంభన
Published on: Sat Apr 28, 2012 10:10AM
విశాఖజిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. గంటెల సుమనా, అనిత, అంబటి విజయరావు పేర్లు బాగా వినిపిస్తున్నప్పటికీ కొత్తగా ఇప్పుడు మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. పోలీసు అధికారిగా పనిచేస్తున్న వై.ప్రేమ్ బాబు కూడా కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన గతంలో విజయనగరంజిల్లా పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు టిక్కెట్టు లభించలేదు. పి.ఆర్.పి. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినందున ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆయన ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి తన పేరును పరిశీలించవలసిందిగా కోరినట్లు తెలిసింది. దీంతో టిక్కెట్టు ఎవరికీ లభిస్తుందన్న విషయమై పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.


