బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం సంచలన తీర్పు

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆమెకు రూ.50 లక్షల నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. రెండు వారాల్లోగా ఇది అమలు చేయాలని స్పష్టం చేసింది.

2002 లో గోద్రా అల్లర్ల తర్వాత అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన బిల్కిస్ బానో కుటుంబంపై దుండగులు దాడి చేసి ఎనిమిది మందిని హత్య చేశారు. గర్భవతి అయిన బిల్కిస్ బానో, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బానో  పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరకు 2004లో ఈ అఘాయిత్యంపై కేసు నమోదయింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారించిన 12 మందికి ముంబై హైకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం బానోకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా ఆమె దాన్ని తిరస్కరించారు.