TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బలప్రదర్శనకు ససేమిరా.. బాలినేనికి జనసేనాని ఝలక్!

Published on: Thu Sep 26, 2024 10:39AM

మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. ఆయన ఒకటి తలిస్తే మరోటి జరుగుతోంది. వైసీపీలో  ఓ మూడేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బాలినేని.. అప్పట్లో జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలో  మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ ఆయన జగన్ తో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతూ వస్తున్నారు. అలకలు, అసంతృప్తులతో జగన్ కు చెవిలో జోరీగలా, చెప్పులో రాయిలా మారారు.

అయితే జగన్ అధికారం కోల్పోయే వరకూ వైసీపీతో, జగన్ తో తన బంధం తెగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎప్పుడూ కూడా ఆయన తెగే వరకూ లాగలేదు. జగన్ నుంచి చిన్న పాటి పిలుపుకు, బుజ్జగింపులకు మెత్తబడిపోయారు. అయితే జగన్ అధికారం కోల్పోయాకా.. ఇంకా ఎందుకు అనుకు న్నారేమో వైసీపీకి రాజీనామా చేసేసి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా జనసేనాని బాలినేని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఆయన గురువారం (సెప్టెంబర్26)న జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో అట్టహాసంగా, మందీ మార్బలంతో పెద్ద ఎత్తున బలప్రదర్శనతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే ఇక్కడే పవన్ కల్యాణ్ ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చారు.

బాలినేని బలప్రదర్శనకు ఆయన అంగీకరించలేదు. మంది మార్బలంతో, అనుచరగణంలో జనసేనలో చేరాలన్న బాలినేని ఆశలను పవన్ కల్యాణ్ మొగ్గలోనే తుంచేశారు. బాలినేని చేరిక సందర్భంగా ర్యాలీకి కూడా జనసేన అధిష్ఠానం అనుమతించలేదు. దీంతో తాను జనసేనలో చేరేది లేదంటూ అలగడానికి ప్రయత్నించినా.. జనసేన అధినేత స్పందించలేదు.

దీంతో గత్యంతరం లేక ఒంటరిగానే అంటే ఒక్కడుగానే పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు బాలినేని.  చేరాలనుకుంటే ఒక్కడివే మంగళగిరి వచ్చి జనసేన కండువా కప్పుకో.. అంతే కానీ ఒంగోలులో సభ, భారీ ర్యాలీ అంటే కుదరదని జనసేన అధినేత కుండబద్దలు కొట్టినట్లు బాలినేనికి చెప్పేశారని తెలుస్తోంది.