టన్ను ఇసుక ధర రూ 900.. ఇదేనా పారదర్శకత: ప్రభుత్వం పై పవన్ ఫైర్

 

 

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా ప్రజలను దోచుకుందని చెప్పిన వైసిపి ప్రభుత్వం, జగన్ నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకు కొనసాగుతున్న ఇసుక పాలసీని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా సెప్టెంబర్ 5 నుండి ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావడం కోసం కొత్త ఇసుక పాలసీని తీసుకు రావడం జరిగింది. దీనిలో భాగంగా టన్ను ధర ను రూ 370 గా నిర్ణయించడం జరిగింది. ఐతే ఈ రోజు కొత్త ఇసుక పాలసీ వచ్చిన తరువాత ఇసుక లభ్యత పై వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు జనసేన అధిపతి పవన్ రాజధాని ప్రాంతం లో పర్యటించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్ ను అయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణదారులు పవన్ దృష్టికి తీసుకు వచ్చారు. టన్ను ఇసుకకు రూ.900 వసూలు చేస్తున్నారని కార్మికులు చెప్పారని అయన అన్నారు. కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రకటించిన ధరకే ఇసుకను విక్రయించాలి కదా అని ప్రశ్నించారు. పారదర్శకత కోసం కొత్త విధానం అమలు చేస్తున్నపుడు టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారని అయన విమర్శించారు. ప్రభుత్వ విధానాలపై తాము ఎలాపడితే అలా విమర్శలు చేయమని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాత మాత్రమే తాము స్పందిస్తామని పవన్ తెలిపారు.