TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆప్షన్‌లతో అయోమయాన్ని బయటపెట్టుకున్న జనసేనాని

Published on: Sun Jun 5, 2022 10:47PM

ఎప్పుడూ ఒకేలా వుండాలని లేదు. అందులోనూ రాజకీయాల్లో. కాస్తంత పావులు కదపడం, పరిస్థితులను కాస్తంత గ్రహించగల్గితే చాలు. చెస్‌లో రాజుగారికి చెక పెట్టడానికి మరో చేయి ఆసరా కొన్నాళ్లే బ్రో! ఆనక అన్నీ తెలుస్తాయి. గతం లో సరే అని తగ్గినంత మాత్రాన ఈసారి తగ్గుతామని అనుకోవద్దు, ఈసారి తగ్గాల్సిన అవసరం మీదే అంటున్నారు జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. పవన్‌ నీ బాటేమిటో స్పష్టంచేయి నాయనా అన్నాయి ఆంధ్రా, తెలంగాణాల్లోని ప్రధాన పార్టీలు. ఆయన చాలా స్టయిల్‌గా వినిపించీ వినిపించకుండా ఏదో అనేసేరు, జనాకర్షణ కోసం అన్నట్టు. దాని తాత్పర్యం అర్ధం అయేసరికి మూడేళ్లు గడిచింది. ఎందుకంటే ఆయన మాట ఆయనే విడమర్చాలి.. ట్రాన్స్‌లేటర్లు ఎవరూ లేరు.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తాను తగ్గి గెలిపించానని పవర్‌స్టార్‌ స్పష్టం చేసేరు. తాను అప్పుడు ఎంతో సాయం చేసిపెట్టానుగనుక ఇప్పుడు తనకు మద్దతునిచ్చి గెలిపించాల్సిన భారం తలకెత్తుకోమని పవన్‌ టిడిపి అధినేత చంద్రబాబుకి చాలా ఫ్రెండ్లీ హెచ్చరిక చేసేడు. చేతల్లో సాయం మహాబలమైనది. అదే చేయమంటున్నాడు జనసేనాధిపతి. కానీ ప్రస్థుత పరిస్థితుల్లో మరి టిడిపి అధినేతకు ఆ సూచన లాంటి హెచ్చరికి ఎంతవరకూ మింగుడుపడుతుంది రాష్ట్రంలో తాను 2024లో ఎలాగయినా పీఠం ఎక్కాలని టిడీపి కార్యకర్తలకు సింహబలం చేకూర్చేపనిలో పడిన పెద్దాయనకు పవన్‌ కళ్యాణ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటారని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన అంత గొప్పగా లేదని, ప్రజలు ఇప్పటికే బాగా విసిగెత్తేరని టిడిపి వైపు ఆశగా చూస్తున్నారనీ  మహానాడు విజయం చేయడంతో అందరికీ అర్ధమైపోయింది.  టిడిపి ఒంటిగా పోటీచేయగలదని, మళ్లీ అధికారంలోకి వచ్చే సత్తా ఆ పార్టీకే ఉందనీ బాదుడే బాదుడును విజయవంతం చేయడంతో జనం ఇప్పటికే తమ అభీష్టం చెప్పేశారు.   చంద్రబాబు రాజకీయ అనుభవం ఇప్పటికే అర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టగలరన్న నమ్మకం జనంలో కనిపిస్తోంది.  అందువల్ల తనతో పొత్తుపెట్టుకోవడం మీకే మంచిది అని పవర్‌స్టార్‌ సినిమా స్టయిల్లో ఆహ్వానిస్తే టిడిపి నేత వెంటనే అంగీకరిస్తారని ఆయన భావించడం అంటే తనను తాను ఎక్కువగా ఊహించుకోవడమే అవుతుంది. ఓటర్ల పల్స్‌ బాగా తెలిసినవారు,  కొత్తగా పావులు కదపడం నేర్చిన వారి సూచనలు సీరియస్‌గా ఎలా తీసుకుంటారు అలాగే చూద్దాంలే అనొచ్చు. అందుకు కారణం లేకపోలేదు. జనసేన ఇప్ప టికే బిజెపితో చిర్నవ్వులతో స్నేహపూర్వకంగానే వుంది. అలాంటపుడు ఇమడని రెండు కత్తులను ఒక వొరలో ఎలా కుదర్చడం. బిజెపితో స్నేహంగానే వుంటూ, టిడిపిని పొత్తుకి ఆహ్వానించడంలో పవన్‌ చాలా   తెలివి ప్రదర్శిస్తున్నాడనే అనాలి.
రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా హెచ్చరించేంత అనుభవంలేని నేత తలనెరిసిన వారికి ఇక తగ్గాల్సింది మీరే అని హెచ్చరికలు జారీ చేయడం, అదీ ఫ్రెండ్లీగా అయినా చేశారంటే కమలనాధుల అండదండల ధైర్యమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు మూడు ఆప్షన్లు అంటూ పవర్‌స్టార్‌ చెప్పినవేమిటంటే.. బిజెపి దోస్తానాలో పోటీచేయడం, టిడిపి ఓకే అంటే వారితో కలిసి పోటీ చేయడం, మూడవది..అసలిదంతా తలనొప్పి అనుకుంటే ఒంటరిగా పోటీచేయడం. ఇక్కడే అర్ధమవుతోంది పవన్‌ అనుభవ రాహిత్యం. అందరితో చర్చించి తీసుకునే నిర్ణయాలకు, అందర్నీ విన్నట్టు నటించి తీసుకునే నిర్ణయాలకూ ఎంతో తేడా వుంది. ఇవి ఆప్షన్లా! ఆయన పరిస్థితిని ఆయనే స్వయంగా బయటపెట్టుకోవడం తప్ప. టిడిపి ఎలాగూ ఆయన్ను అంత సీరియస్‌గా తీసుకోదనే విశ్లేషకులు అంటున్నారు.

ఇక బిజెపి మాత్రం ఆయన ఆవేశాన్ని క్యాష్‌ చేసుకోవచ్చు. తప్ప ఆయన వల్ల రాష్ట్రంలో చక్రం తిప్పేయవచ్చు అని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇక మిగిలింది ఒంటిగా పోటీ చేయడం.ఒంటరిగా పోటీ చేయాలి. చేస్తేనే రాష్ట్రంలో తన సత్తా, పార్టీ సత్తా ఏమిటన్నది మరింత స్పష్టమవుతుంది. సన్మాన సభలు, పార్టీ సభలు, సమావేశాలకు వచ్చే జనం అంతా ఓట్లు వేసి అమాంతం నెత్తిన పెట్టుకోవడానికి పవన్‌ ఎన్టీఆర్‌ కాద న్నది తెలుసుకోవాలి. కనీసం చిరంజీవి కూడా కాదు. తెరమీద నాయకుడే గాని బయట రాజకీయరంగంలో నిలబడ సత్తా ఎంత వుందని ఒంటిగా ఆలోచించాల్సిన అవసరం వుంది. సవాలు చేయడం చాలా సులువు. కానీ అందుకు గుండె ధైర్యం తో నిలబడటం చాలా కష్టం. ఇవాళ జై అన్నవారు రేపు నీకు ఓటు వేస్తారన్న గ్యారంటీ బొత్తిగా వుండని కాలం ఇది. ఎవరు ఎవర్ని నమ్మాలి, ఏ సిద్ధాంతాన్ని ఎందరు నమ్ముతున్నారన్నదీ ఆయన బేరీజు వేసుకోవాలి.

అయినా పొత్తు అనేది ప్రేమలాంటిది. అవతలివారూ మీ ప్రేమని నమ్మాలి గదా! జనసేనవారు ఏ మాటమీద నిలబడతారో వారికి క్లారిటీ వచ్చాకనే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని   చంద్రబాబు యోచన. మరంచేత, జనసేనీయులు కూడా పెద్దాయన అన్న మాటల్ని బాగా అర్ధంచేసుకుని పవర్‌స్టార్‌కి అర్ధమయేలా సూచించడం ఇక చాలా అవసరం.  ఇక్కడ మరో సంగతేమంటే.. ఎంతో సత్సంబంధాలు నెరపుతున్న బిజెపి వారు పవన్‌ను తమ ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా ప్రకటించనే లేదు.  అంటే వారికి కేంద్రంలోని పార్టీ అధినేతలు ఆ సంగతి స్పష్టం చేయలేదు. చేస్తారన్న నమ్మకం కూడా లేదు.

ఎందుకంటే పవన్‌ పవర్‌స్టార్‌గా ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి. ఓట్లు రాబట్టుకోవడానికి అదొక అస్త్రం.. అలానే పవన్‌ని చూస్తారు. అంతేగాని ఏకాఎకీ గెలిచే గుర్రంలా ఎలా భావిస్తారు. అలాంటపుడు ఆప్షన్లు ఇస్తున్నాను మీరే తేల్చుకోండి అంటూ ధీమాగా అనడం కేవలం అమాకత్వమే అవుతుంది. జనసేన నాయకుడి నించి అభిమానులు ఆశిస్తున్నది అమాయకత్వం కాదు. పార్టీని విజయపథంలోకి తీసికెళ్లగల అసలు సిసలు సత్తా. అది ఏ మాత్రం డోసేజీ వుందో ఆయన తెలుసుకోవాలి.

తాను చాలా శక్తిమంతుడనని ప్రచారం చేయించుకోవడానికి ఆప్షన్లు ప్రకటించడం ఒక మార్గం అనుకుందాం. అసలు ఆప్షన్లు ఇచ్చి హెచ్చరించే శక్తి వున్నపుడు, వేరేవారిని పీఠం ఎక్కించడానికి మరో అవకాశం ఇస్తున్నానని చూచాయిగా వ్యక్తం చేసేబదులు తమరే సీఎం పీఠాన్ని ఎలా ఎక్కాలో ఆలోచించుకోవచ్చు కదా. మీరంటున్నదానికి మీరే క్లారిటీ ఇవ్వలేకపోతే ఎలా?పవన్ తన మనసులో మాట తనకు  దగ్గరి వారికయినా చెప్పి వారి సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంది. ఎంతయినా రేపు ఎన్నికల సమయంలో మీ వెనక జెండా వెూసేది,

మిమ్మల్ని నిమ్మళంగా వుంచగలిగేది మరి మీ సైన్యమే. వారికి మీ మనసులో మాట స్పష్టం చేయడం చాలా అవసరం. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో తెలుగుదేశంతో కలిసి పని చేస్తోంది. సో..జనసేన క్యాడర్ మూడ్, తమ పార్టీ అధినేతకు జనసేన క్యాడర్ ఇస్తున్న సంకేతం జనసేనాని అర్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది.