TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ ఖేరా అరెస్ట్ కోసం హైదరాబాద్‌కు అస్సాం పోలీసులు

Published on: Tue Apr 7, 2026 3:28PM

 

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యపై పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల పవన్ ఖేరా, అస్సాం సీఎం భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను అపకీర్తికరంగా భావించిన అస్సాం ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదవడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు ముందుగా ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకున్నట్లు తెలిసింది.

పవన్ ఖేరా భార్య కోట నీలిమ కూడా కాంగ్రెస్ నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తుండగా, అస్సాం ప్రభుత్వం మాత్రం ఇవి చట్టపరమైన చర్యలేనని స్పష్టం చేస్తోంది. కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.