తెలంగాణలో పవన్ యాత్ర.. షెడ్యూల్ ప్రకటించిన జనసేనాని

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపికలు, ప్రచారాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఈ లోగా జనం దృష్టిని తమ వైపు మరల్చుకోవడానికి పార్టీల అధినేతలు పావులు కదుపుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో తాను పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని.. అనంతరం యాత్ర మొదలు పెట్టనున్నట్లు పవన్ చెప్పారు. ఆ తర్వాత తమ కార్యకర్తలతో చర్చలు జరిపి తెలంగాణలో ఎక్కడెక్కడ ఎలా పర్యటన చేయాలన్నది మళ్లీ కొండగట్టు వచ్చి పూర్తి యాత్ర వివరాలను వెల్లడిస్తానన్నారు.

 

కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నానని.. పాదయాత్రలో ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని అన్నారు. పాదయాత్ర, బస్సుయాత్ర, రోడ్‌షో ఇలా వీలున్న మార్గంలో ప్రజలను కలుస్తానని జనసేనాని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ప్రమాదంలో తాను బయటపడటానికి కొండగట్టు ఆంజనేయస్వామే కారణమన్నారు. తమ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.