పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఉత్తదే..?
Published on: Mon Jun 28, 2021 10:28AM
ఎక్కడ యాక్టివ్ గా ఉన్నా లేకున్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్...జనసైనికులు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్లు యాక్టివ్ గా ఉంటారు. అందుకే సోషల్ మీడియా న్యూస్ లో ఆ పేరు ఎలాగోలా వినిపించేద్దామని చూస్తారు. ఈ మధ్య యూట్యూబ్ పై బాగా డిపెండ్ అయిపోయిన శాటిలైట్ ఛానెల్స్ సైతం అదే ట్రెండ్ లో వెళుతున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ న్యూస్ ఏమీ లేకపోయినా.. ఏదో ఒక అవకాశంతో ఏదో ఒకటి క్రియేట్ చేస్తే చాలు పిచ్చ వ్యూస్ వస్తాయని రాసేసుకుంటున్నారు. రిపోర్టర్ చిన్న ముక్క అందిస్తే చాలు.. హాఫెన్ హవర్ ప్రోగ్రామ్ తో చెలరేగిపోతున్నారు. అలా పుట్టిందే పవన్ కల్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి అనే వార్త.
పవన్ కేంద్రమంత్రి వర్గంలో చేరుతున్నాడు..బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది ఇది కాదు.. ఏకంగా హోంశాఖ ఇస్తున్నారంటూ మీడియా చెలరేగిపోయింది. గ్రౌండ్ డేటాకు... ఈ న్యూస్ కు పొంతన లేకపోవడంతో చాలామంది అయోమయంలో పడ్డారు. నిజమేనా..? ఇది నిజమేనా?అంటూ అందరూ తెగ చర్చించుకున్నారు. కరెక్టని కొందరు.. కాదని కొందరు వాదులాడుకున్నారు కూడా. అయితే గ్రాడ్యువల్ గా ఆ న్యూస్ వెనక్కి పెట్టేశారు. ఇప్పుడు రాసే కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల్లో పవన్ కల్యాణ్ పేరే వినపడటం లేదు. అదేంటని బిజెపి నేతలను అడుగుతుంటే..పుట్టించింది మీరే..చంపేసింది మీరే..మధ్యలో మమ్మల్ని అడుగుతారేంటని నవ్వుతున్నారు.
ఒక పక్క పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్నారు. అదేమంటే డబ్బులు కావాలి కదా పార్టీ నడపాలంటే అనే సమాధానం ఎప్పటి నుంచో వినపడుతుందే. తిరుపతి సీటు ఇస్తాం ఇస్తాం అని చివరకు ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ కూడా మొక్కుబడిగా ఒక్క మీటింగుతో సరిపెట్టారు. ఆ తర్వాత కరోనా కలిసి రావడంతో అసలు వెళ్లనే లేదు. ఓట్లు ఘోరంగా వచ్చాయి. పవన్ సీఎం క్యాండేట్ అని కూడా ఈ సందర్భంగానే అనౌన్స్ చేశారు. బిజెపి ఏమో తన కార్యక్రమాలు తాను...జనసేనతో ఒప్పందానికి భిన్నంగా పోతోంది. దీనిపై కూడా జనసేన నేతలు కూడా గుర్రుగానే ఉన్నారు.
మొదటి నుంచి పవన్ కల్యాణ్ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. జగన్ సైతం..ఇతర పార్టీల నేతలకు భిన్నంగా పవన్ కల్యాణ్ పై పర్సనల్ అటాక్ చేశారు. అందుకే 2019 ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ జగన్ మీదే కేంద్రీకరించారు. అప్పుడప్పుడు చంద్రబాబు, లోకేష్ అవినీతి అది ఇదీ అన్నా కూడా.. జగన్ మీదే ఎక్కువగా విరుచుకుపడ్డారు. జగన్ కేసులు విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకున్నారు.
ఇలా పవన్ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. బిజెపి మాత్రం వైసీపీతో డబల్ గేమ్ ఆడుతోంది. పైకి విమర్శలు చేస్తూ..లోపల అన్నిటికి సహకరిస్తోంది. అది అందరికీ అర్ధమవుతూనే ఉంది. అమరావతి విషయంలో పాదయాత్ర చేస్తానన్న పవన్ ను ఆపేసింది బిజెపియేనని అందరికీ తెలుసు. తమ అవసరాలు పెరుగుతున్న కొద్దీ బిజెపి జగన్ ను చేరదీస్తోంది. ఈ పరిణామం పవన్ కు మింగుడుపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే కాస్త సైలెంటుగా ఉంటున్నారంటున్నారు. పరిస్ధితులన్నీ ఇలా ఉంటే..పవన్ ను కేంద్ర మంత్రి చేస్తారని ప్రచారం చేసేశారు. అది ఉత్తదేనని ఇప్పుడు తేలిపోయింది.


