అంతొద్దు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు! వైసీపీ ఎంపీలపై పవన్ సెటైర్లు
Published on: Mon Dec 20, 2021 12:04PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీల చేతగాని తనాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసి అయినా అడ్డుకుంటామని గతంలో వైసీపీ ఎంపీలు చెప్పిన గాలి మాటల్ని ఆయన జనసేన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రస్తావిస్తూ.. ‘అంతటి త్యాగాలు అక్కర్లేదు. కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు’ అంటూ హితవు పలికారు.
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం’ అని చెప్పారు. అయితే.. వైసీపీ ఎంపీలు ఈ విషయంపై పార్లమెంటులో కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 18,19, 20 తేదీల్లో డిజిటల్ ఉద్యమం నిర్వహించాలని జనసేన నేతలు, శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డిజిటల్ ఉద్యమం నిర్వహిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ ప్లకార్డులు పట్టుకుని వారంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వైసీపీ ఎంపీలు గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


