'ప్రతిజ్ఞ'తో పరువంతా పాయే!.. వైసీపీ నేతల ఇజ్జత్ తీసిన జనసేనాని..
Published on: Tue Mar 15, 2022 11:19AM
జనసేనాని ఈసారి కాస్త రూట్ మార్చారు. గుంటూరు కారంలా మండిపడకుండా.. గోదారోళ్ల స్టైల్‌లో వెటకారంతో వైసీపీకి గొడ్డుకారం తినిపించారు. అప్పుడప్పుడూ కాస్త పవర్‌ఫుల్ పంచ్‌లు వేసినా.. జనసేన ఆవిర్భావ సభ ఆసాంతం సెటైర్లతోనే నడిపించారు. పవన్ కల్యాణ్‌లో ఈ మార్పు.. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
వైసీపీ ప్రతిజ్ఞ ఇదేనంటూ.. ఆయన చేసిన సెటైరికల్ స్పీచ్ ఫ్యాన్ పార్టీ తుప్పు రేగ్గొట్టింది. పవన్ చెప్పిన ఆ ప్రతిజ్ఞ వింటే.. అధికార పార్టీ నేతలు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. అంతలా పరువు తీసేలా ఉంది ఆ ప్రసంగం.
విధ్వంసమే వైసీపీ విధానమనేలా అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేసినట్టుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్ విమర్శించారు. బహుశా వైసీపీ చేసిన ప్రతిజ్ఞ ఇదే కావొచ్చు అంటూ అది చదివి వినిపించారు. ఆ ప్రతిజ్ఞ ఆసాంతం అధికార పార్టీని కుమ్మేసేలా, వారి అరాచకాలను, దోపిడీని, అవినీతిని, అక్రమాలను ఎత్తి చూపేలా ఉంది. జనసేనాని చెప్పిన వైసీపీ ప్రతిజ్ఞ ఏంటంటే...
"ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి.. ఆంధ్రులందరూ మా బానిసలు..
న్యాయవ్యవస్థను లెక్కేచేయం.. పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం..
రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం.. ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం..
పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం..
అన్నంపెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం..
ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం..
పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం..
సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం..
మా వైసీపీ ఎంపీ అయినా సరే.. ఎదురు తిరిగితే చితక్కొడతాం..
ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం..
ఇంకొక్క చాన్స్ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం.."


