ప్రజారాజ్యం గెలిచిన స్థానాలే జనసేన టార్గెట్టా?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం సహజం. అలా అని సినిమాల్లో రాణించిన వారందరూ రాజకీయాల్లో రాణించాలని రూల్ లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణించిన వ్యక్తి అంటే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన.. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఘన విజయం సాధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారు. సినిమాల్లో ఎన్నో దేవుడి పాత్రల్లో కనిపించి కనువిందు చేసిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎందరో పేదప్రజల చేత దేవుడి అనిపించుకున్నారు. ఒకరకంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణించొచ్చని రుజువు చేసింది ఆయనే. ఆయన తరువాత కూడా ఎందరో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ స్థాయికి చేరుకోలేకపోయారు.

 

 


ఎన్టీఆర్ తరువాత సినిమాల్లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకొని మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నికల్లో కేవలం 18 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్నారు. తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు కొద్దికొద్దిగా దూరం జరుగుతూ వచ్చిన ఆయన.. ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇక సినిమాల్లో బాగా పేరుతెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన మరోవ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించుకొని పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. అయితే స్టార్ హీరోగా పీక్స్ లో ఉన్న టైంలో అనూహ్యంగా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 లోనే జనసేనను స్థాపించారు కానీ ఆ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పవన్ టీడీపీని తీవ్రంగా వ్యక్తిరేకిస్తూ విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

 

 


నిన్నమొన్నటి వరకు పవన్ సీఎం అవ్వగలరా? అంటూ చర్చలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబుని సీఎం అవ్వకుండా పవన్ ఆపగలరా? అంటూ చర్చలు మొదలవుతున్నాయి. అయితే పవన్ మాత్రం సీఎం అవ్వాలన్న ఆలోచన కంటే ముందు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ దృష్టంతా ప్రస్తుతం ఏపీ మీదే ఉంది. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనా పవన్ మాత్రం ఆ వైపు చూడట్లేదు. దీనిబట్టి పవన్ వచ్చే ఏపీ ఎన్నికల మీదే తన దృష్టంతా పెట్టినట్టు అర్ధమవుతోంది. అయితే పవన్ 2009 లో ప్రజారాజ్యం గెలిచిన సీట్లను బట్టి వచ్చే ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధించిన, అదే విధంగా రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారట. వాటిల్లో విజయం మీద సాధిస్తే పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం వస్తుంది అలానే కర్ణాటకలో జేడీఎస్ లాగా కింగ్ మేకర్ అయ్యే అవకాశం వస్తుందని ఆలోచిస్తున్నారట. మొత్తం 175 స్థానాల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచినా చాలు.. టీడీపీ అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశముంది. అలాంటి సమయంలో కర్ణాటకలో కుమారస్వామిలా కింగ్ మేకర్ అవుతారు. ఇప్పటికే పవన్, వైసీపీతో పొత్తుకు సిద్ధమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పవన్ అనూహ్యంగా ఎన్నికల తరువాత వైసీపీతో చేతులు కలిపి ట్విస్ట్ ఇస్తారా?. చూద్దాం మరి పవన్ ఏం చేస్తారో.