రాజధాని నిర్మాణం అడ్డుకుంటాం - పవన్

రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించి రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభత్వం భూ సేకరణ చేసిన విషయం అందరికి విదితమే.అయితే పవన్ టీడీపీ పై భూ సేకరణ నేపధ్యం లో మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.తాజాగా ‘2013 భూ సేకరణ చట్టం - పరిరక్షణ’ పేరిట విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.రాజధాని కోసం 1850 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేశారు. కానీ అది కాస్తా లక్ష ఎకరాలకు పెరిగిపోయిందని ఆరోపించారు.

 

 

ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇంత స్థలం ఏమి చేస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీలు ప్లాంటు కోసం భూ సేకరణ చేశారని..కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. పర్యావరణం ధ్వంసం చేస్తూ రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని సూటిగా ప్రశ్నించారు.ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపురం నుంచి ఉప్పెనలా వస్తామన్నారు.ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు.తాను పర్యటిస్తున్న సమయంలో రక్షణ కల్పించడం లేదని, పోలీసు..రెవెన్యూ వ్యవస్థను తప్పుపట్టడం లేదని,సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు.భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్‌ యార్డు లేదన్న పవన్‌.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రజల కోసం తాను పోరాటానికి సిద్ధమని,చావడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.