ప్రజారాజ్యం కన్నా ముందే రాజకీయాల్లోకి రావాలనుకున్న

 

పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..  ఇవాళ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ మాదిరి ఒత్తిడి తట్టుకునే నాయకులు కావాలని సూచించారు. 2014 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని గుర్తుచేసుకున్న ఆయన.. కొన్ని స్థానాల్లో పోటీ చేస్తే పార్టీ బలోపేతం ఆగిపోతుందనే.. పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వడంతో వారు గెలిచారన్నారు.  ఏపీలో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ సీఎం చేయండి అంటుంటే, వైసీపీ ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటోందని ఎద్దేవా చేసారు. ఇలా సీఎం పదవి కోరుకునే వారికి చిత్తశుద్ది ఉండదని మండిపడ్డారు. మార్పు కోసమే తాను జనసేనను స్థాపించానని చెప్పారు. ప్రజారాజ్యం కంటే ముందే కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టానని, 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాజకీయాలు తనకు వ్యాపారం కాదన్నారు. జనసేనకు యువత, మహిళలే ప్రధాన బలమని.. యువశక్తి రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుందని పవన్‌ చెప్పారు.