నాగబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందన.. ప్రజాసేవ తప్ప వేరే అంశాల జోలికి వెళ్లొద్దు

నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గాంధీని చంపిన గాడ్సేని పొగడటం ఏంటంటూ నాగబాబుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో నాగబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వివాదంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన పవన్.. కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని వెల్లడించారు. నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను.. జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని అన్నారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నట్టు తెలపారు. కరోనా కష్టకాలంలో.. ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని జనసైనికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు.