రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించకూడదు: పవన్

 

ఏపీ రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈరోజు హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్ ని కలిశారు. రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు పవన్ ని కోరారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబు అని పవన్‌‌ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే కానీ రద్దు చేస్తామనడం సరికాదని పవన్ హితవు పలికారు. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదన్నారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని తెలిపారు. ఇప్పుడు రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. రాజధాని కోసం రైతులు తరతరాలుగా వస్తున్న భూములను త్యాగం చేశారని కొనియాడారు. రైతులకు పొలం పని తప్ప ఇంకేమీ తెలియదన్నారు. అయినా పొలాలను వదులుకున్నారంటే అది రాష్ట్రం కోసమేనని పవన్ ప్రశంసించారు.