అప్పుడు పవన్ చెప్పింది వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

కీడు ఎంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో 2015 లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట గుర్తుచేశారు. "అనేక వేల మంది రైతులు.. వారి నమ్మకాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని టీడీపీ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి?. కీడు ఎంచి మేలెంచమంటారు కదా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాలేదు అనుకున్నాం. అప్పుడు మంత్రి నారాయణ ఉండరు, పత్తిపాటి పుల్లారావు ఉండరు. మరి రైతుల పరిస్థితి ఏంటి?. వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి?. వారు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు.. కానీ ఆ నమ్మకానికి గ్యారంటీ ఏంటి?" అని పవన్ ప్రశ్నించారు.

పవన్ అనుమానమే నిజమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు పెట్టుకున్న నమ్మకం కన్నీటి పాలైంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు అడుగులు వేస్తోంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంచి.. మిగతా పరిపాలన విభాగమంతా విశాఖకు తరలిస్తోంది. దీంతో రైతులు, మహిళలు.. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు ఎంత గొంతు చించుకున్నా, ఎంత కన్నీరు పెట్టుకున్నా ఏం లాభం?. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది.

అప్పుడు టీడీపీ నేతలు.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం.. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రాకెట్ లా దూసుకుపోతుందని చెప్పారు.. ల్యాండ్ పూలింగ్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా వంటివారు.. ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారు. మీ భవిష్యత్తు ఆకాశాన్ని తాకుతుంది అంటూ.. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? పవన్ అనుమానించినట్టుగానే.. టీడీపీ అధికారంలోకి రాలేదు. రైతుల నమ్మకానికి గ్యారంటీ ఏంటని పవన్ ప్రశ్నించినట్టుగానే.. వారి నమ్మకం దుఃఖంగా మారింది.

ఇప్పుడు రైతులు రాజధానిని తరలించొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు రైతులకు మాటలు చెప్పి భూములు తీసుకున్నవారు ఏమైపోయారు?. ముఖ్యంగా 'ల్యాండ్ పూలింగ్' అనే సినిమాకి తానే 'స్టోరీ-డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్' అన్నట్టు ఫీలైన మాజీ మంత్రి నారాయణ ఏమైపోయారు?. అప్పుడు రైతులు భూములు ఇచ్చేవరకు తిరిగారు కాదా.. మరి ఇప్పుడు అదే రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే.. వారి పక్షాన పోరాడరా?. ఏమైపోయారు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలు?. దేవినేని ఉమా వంటి వారు అప్పుడప్పుడు బయటికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కానీ.. నిజంగా రైతులకు మేమున్నామన్న ధైర్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారా? లేదు.

అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో.. రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించాలని టీడీపీ ప్లాన్ చేసింది. కానీ ఏమైంది? టీడీపీ నేతలు ఎంతమంది పాల్గొన్నారు?. ఎవరికివారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే చాలు, మేం ఉద్యమంలో పాల్గొన్నట్టే అని ఫీలయ్యారు. ఈ తూతూ మంత్రం పోరాటాలు వల్ల ఒరిగేది ఏంటి?. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనని హౌస్ అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి.. సీక్రెట్ గా ఒక చోట దాక్కొని, పోలీసుల కళ్ళు గప్పి సడెన్ గా ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అలాంటి దూకుడు ఏపీ టీడీపీ నేతల్లో కరువైంది. ఎలాగూ హౌస్ అరెస్ట్ చేస్తారు.. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అన్నట్టుంది నేతల తీరు. ఎంపీ గల్లా జయదేవ్ మాత్రమే దూకుడు కనబరిచారు. కొందరి నేతల్లా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయకుండా.. పొలాల వెంట, గుట్టల వెంట నడిచి.. రైతులకి అండగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరి మిగతా నేతలు ఏం చేస్తున్నారు? అప్పుడు రైతుల పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం పోరాడలేరా?