సినిమాలు, ధార్మిక దీక్షలు, రాజకీయాలు.. జనసేనాని ప్రాధాన్యతలేమిటి?
Published on: Tue Jul 12, 2022 6:47AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియనేనా? రాజకీయాలతో పాటు సినిమాలు, ఇప్పుడు ధార్మిక దీక్షలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒక వైపు జనసేన కార్యక్రమాలతో ప్రజలలోకి వస్తానంటూనే మరో వైపు సినిమాలతో యమా బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ధార్మిక దీక్ష చేపట్టి జనాలకు ఏ సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారంటూ రాజకీయ వర్గాలలో ఓ చర్చ ఓ లెవల్ లో సాగుతోంది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అలాగే భవదీయుడు భగత్ సింగ్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు.
అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో మరో సినిమాకు సైతం ఓకే చెప్పారు. అదే సమయంలో దసరా నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితమౌతానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఉరుము లేని పిడుగులా పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ధార్మిక దీక్ష చేపట్టారు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో పవన్ ఈ దీక్షలో ఉంటారు. ఈ నాలుగు నెలలు కూడా పవన్ చాలా నిష్టగా ఉంటారు. దీంతో ఈ దీక్షలో ఉంటూ పవన్ ఏం చేయబోతున్నారు,
షూటింగ్స్, రాజకీయాలు ఎలా నడపబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నాలుగు నెలలపాటు ఒక్కపూట మాత్రమే భోజనం చేయనున్నారు పవన్ కల్యాణ్. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. రాత్రికి శాకాహారం భోజనంతో ఆరోజుకు దీక్షను ముగిస్తారు. ఇలా ప్రతిరోజూ, నాలుగు నెలలపాటు దీక్ష చేయనున్నారు పవన్ కల్యాణ్. ఆహార నియమాలను అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడనుందని చెబుతున్నారు.


